: ఓపిగ్గా ఉండండి...10 వేల కోట్లు అడిగాం: చంద్రబాబు
నోట్ల రద్దుతో రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు నెలకొన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఆర్బీఐ గవర్నర్ తో మాట్లాడానని అన్నారు. ఇప్పటి వరకు 8 వేల కోట్లు పంపారని, ఇంకా 10వేల కోట్ల రూపాయలు పంపాలని కోరామన్నారు. ఆన్ లైన్ సేవలు పెంచాలని ఆయన తెలిపారు. అందుకే 80 శాతం ఈపాస్ మిషన్స్ కు సబ్సిడీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆన్ లైన్ చెల్లింపులకు ఇన్సెంటివ్స్ ప్రకటించాలని ఆయన సూచించారు. ఆన్ లైన్ సేవలంటేనే చాలా మంది భయపడిపోతున్నారని ఆయన చెప్పారు. ఇప్పుడున్న ఆన్ లైన్ సేవలను ప్రక్షాళన చేయాలని ఆయన సూచించారు. వ్యవసాయదారులకు ఇబ్బందుల్లేకుండా కోఆపరేటివ్ బ్యాంకుల్లో పాత నోట్లు తీసుకుని, వాటిస్థానంలో కొత్త నోట్లివ్వాలని ఆయన సూచించారు. ఏపీలో 6 కోట్ల మందికి బ్యాంకు అకౌంట్లున్నాయని ఆయన చెప్పారు. వీరందరూ ఆన్ లైన్ సేవలు వినియోగించుకునేందుకు వీలుగా, స్వైపింగ్ ఛార్జీలు తీసెయ్యాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో 75 శాతం మందికి డెబిట్ కార్డులుంటే...వాటిని వినియోగించేవారు కేవలం 30 శాతం మందేనని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 9,51,000 లక్షలకు పైగా ప్రజలకు బ్యాంకు అకౌంట్లు లేవని ఆయన చెప్పారు. 39 వేల మందికి అకౌంట్లు ఓపెన్ చేసేందుకు చర్యలు చేపట్టగా, మిగిలిన వారికి ఇంకా అకౌంట్లు జారీ చేయాల్సి ఉందని ఆయన అన్నారు. ఇది సమస్యా కాలమని, ప్రజలు ఓపిగ్గా ఉండాలని ఆయన సూచించారు.