: తన కుటుంబీకులు, స్నేహితులతో కలిసి బ్యాంకుకు వచ్చిన మంత్రి.. క్యూలో నిల‌బ‌డనని వ్యాఖ్యలు


నల్లధనాన్ని నిర్మూలించేందుకు రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమ పాత నోట్లను డిపాజిట్ చేసుకోవడం కోసం దేశ వ్యాప్తంగా ప్రజలు బ్యాంకుల ముందు క్యూ కడుతూ నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటున్న కొందరు రాజకీయ నాయకులు బ్యాంకులు, ఏటీఎంల ముందు నిల్చొని ఉన్న ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి వారిని పరామ‌ర్శిస్తుండ‌డం చూస్తున్నాం. అలాగే, ఉత్త‌ర ప్ర‌దేశ్‌కి చెందిన ఓ మంత్రి ఈ రోజు బ్యాంకుకు వెళ్లారు. అయితే, ఖాతాదారుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి కాదు. తన వెంట త‌న‌ కుటుంబీకులు, స్నేహితులను తీసుకెళ్లిన స‌ద‌రు మంత్రిగారు బ్యాంకులో డ‌బ్బు డిపాజిట్ చేసుకున్నారు. డ‌బ్బు జ‌మ చేసుకోవ‌డంలో తప్పేమీ లేదు.. అయితే, ఆ మంత్రి బ్యాంకు వ‌ద్ద ప్ర‌వ‌ర్తించిన తీరు ప్ర‌జ‌ల‌కి కోపం తెప్పించింది. ఉత్త‌రప్ర‌దేశ్‌లో ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ మంత్రిగా ప‌నిచేస్తోన్న ఇక్బాల్‌ మెహమూద్ త‌న‌వారందరితో క‌లిసి సంభాల్‌ ప్రాంతంలోని ఓ బ్యాంక్‌కు వెళ్లి క్యూలో నిల‌బ‌డిన ప్ర‌జ‌ల అంద‌రి క‌న్నా ముందుగా బ్యాంకులోకి వెళ్లిపోయారు. ఉదయాన్నే బ్యాంకుకు చేరుకొని ఎన్నో గంట‌ల నుంచి వేచిచూస్తోన్న ప్రజల గురించి ఆలోచించ‌ని బ్యాంకు సిబ్బంది, మంత్రి బ్యాంకుకు చేరుకోగానే మాత్రం వెంట‌నే బ్యాంకు గేట్లు తెర‌చి స్వాగ‌తం ప‌లికారు. ఆ వెంట‌నే ఆగమేఘాలపై ఆయన పనిని పూర్తి చేసేశారు. ఆ డ‌బ్బు తీసుకొని అక్క‌డితో ఆగ‌ని మంత్రి దురుసుగా మాట్లాడారు. వెళుతూ వెళుతూ.. తానో మంత్రినని, క్యూలో నిలబడాల్సిన అవసరం తనకు లేదని వ్యాఖ్యానించారు. దీంతో క్యూలో నిలబడిన ప్ర‌జ‌లు బ్యాంక్‌ సిబ్బందిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News