: ఎప్పుడు డిశ్చార్జ్ అవ్వాలన్నది జయలలిత ఇష్టం: అపోలో ఆసుపత్రి ఛైర్మన్
సెప్టెంబరు 22 నుంచి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకున్నారని ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి ఈ రోజు మీడియాకు తెలిపారు. జయలలిత తాను ఎప్పుడు డిశ్చార్జ్ కావాలో నిర్ణయించుకొని ఇక ఇంటికి వెళ్లిపోవచ్చని, ఆ అంశంలో ఆమె తన ఇష్ట ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. ఆమెను 15 నిమిషాలు మాత్రమే వెంటిలేటర్‌పై ఉంచుతున్నామని చెప్పారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు చేసిన ప్రార్థనలు ఫలించాయని అన్నారు. ఆమె సాధారణంగానే ఆహారం తీసుకుంటున్నారని, ప్రొటీన్ ఫుడ్ అధికంగా ఇస్తున్నామని ప్రతాప్ రెడ్డి తెలిపారు. జయలలితకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని, ఈ కారణంగా ఆమెకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అందుకే ఐసీయూలోనే ఉంచినట్లు పేర్కొన్నారు.