: నాలుగు వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు... కష్టాల్లో ఇంగ్లండ్!
విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు ఆకట్టుకుంటున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 455 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు పుజారా చెప్పినట్టు ఫాలోఆన్ లో పడే దిశగా ఆడుతోంది. నేటి లంచ్ అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ కు ఆదిలోనే వికెట్ ను విరగ్గొట్టి మరీ వికెట్ తీసి షమీ టీమిండియా ఉద్దేశం చాటాడు. దీంతో కేవలం నాలుగు పరుగులకే కెప్టెన్ కుక్ (2) పెవిలియన్ చేరాడు. అనంతరం అద్భుతమైన స్టంప్ తో హమీద్ (13) పెవిలియన్ చేరాడు. తరువాత అశ్విన్ మ్యాజిక్ బంతితో డక్కెట్ (5) ను బౌల్డ్ చేశాడు. అనంతరం టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకుని అర్ధ సెంచరీ సాధించిన జో రూట్ (53) ను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 34 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. టాపార్డర్ లో కీలక ఆటగాళ్లు పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లతో రాణించగా, షమి, జడేజా చెరో వికెట్ తీశారు.