: రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కుకు కేంద్రం తూట్లు పొడిచింది: ఆర్ఎస్ఎస్ నేత విమర్శలు
పెద్ద నోట్ల రద్దుతో సొంత సంస్థ ఆర్ఎస్ఎస్ నుంచి కూడా బీజేపీకి వ్యతిరేకత మొదలైంది. నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ఆర్థిక ఎమర్జెన్సీ ఏర్పడిన సంగతి తెలిసిందే. పనులన్నీ మానుకుంటున్న ప్రజలు రెండు వేల రూపాయల కోసం బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ నేత గోవిందాచారి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ కి రాసిన లేఖలో కేంద్రాన్ని ఆయన తీవ్రస్థాయిలో తూర్పారపట్టారు. బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తూ, ఆర్థిక అవసరాలు తీరక దేశవ్యాప్తంగా సంభవించిన 40 మంది మరణానికి మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలకు, నష్టపోయిన వ్యక్తులకు నష్టపరిహారాన్ని అందించాలని సూచించారు. ఈ నష్టపరిహారాన్ని కూడా కేవలం మూడు రోజుల్లో చెల్లించాలని ఆయన సూచించారు. లేని పక్షంలో ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, అలాకాకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, ప్రభుత్వ ‘వైఫల్యానికి గుర్తు’ అని ఆయన విమర్శించారు. రాజ్యాంగంలోని 21వ అధికరణలో పేర్కొన్న ప్రజల ‘జీవించే హక్కు’కు కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 1934 ఆర్బీఐ చట్టం ప్రకారం నోట్లను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని ఆయన గుర్తుచేశారు. ఆయన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.