: నల్లధనాన్ని మార్చుకునేందుకు హోటల్ తిప్పలు.. బిల్లులో రెండు నెలల క్రితం తేదీ వేసి ఇస్తున్న వైనం
నల్లధనాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నల్ల కుబేరులు తమ వద్ద కట్టలు కట్టలుగా పడి ఉన్న డబ్బును మార్చుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఇన్నాళ్లుగా ఎవరికీ తెలియనివ్వకుండా దాచుకున్న డబ్బును వైట్ మనీగా మార్చుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరులోని ఓ ప్రముఖ హోటల్ యాజమాన్యం తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకోవడానికి ప్రణాళిక రూపొందించుకొని అమలు చేస్తోంది. తమ హోటల్‌కు వచ్చే కస్టమర్లకు ఇచ్చే బిల్లులో అవకతవకలు చేస్తోంది. తాజాగా బెంగళూరులోని ఓ హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేసేందుకు వెళ్లిన మిథున్ నోబెల్ అనే వ్యక్తి సదరు హోటల్ చేసిన నిర్వాకాన్ని ఫేస్బుక్ ద్వారా తెలిపారు. తమ కార్యాలయ సిబ్బంది కోసం ఫుడ్ ఆర్డర్ చేసేందుకు తాను ఇటీవలే చర్చ్ స్ట్రీట్‌లోని ఆడిగస్ హోటల్‌కు వెళితే, అక్కడ నల్లధనాన్ని మార్చుకునేందుకు ఆ హోటల్ యాజమాన్యం చేస్తోన్న ప్రయత్నాల గురించి తెలిసిందని చెప్పారు. అంతపెద్ద హోటల్లో కార్డు ద్వారా బిల్లు చెల్లింపులకు ఒప్పుకోలేదని చెప్పారు. దీంతో తాను హోటల్లో డబ్బు చెల్లించి బిల్లు తీసుకున్నట్లు, అయితే, బిల్లులో హోటల్ యాజమాన్యం వేసిన తేదీని చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. బిల్లులో తేదీ 1/09/2016 గా పేర్కొన్నారని ఆయన చెప్పారు. బిల్లుల్లో మార్పులు చూపిస్తూ పెద్ద నోట్లు రద్దు కాకముందు నెలలో అమ్మకాలు జరిగినట్లు బిల్లులు సృష్టిస్తూ వారు మోసానికి పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు ప్రభుత్వానికి సహకరించాలని, బిల్లులోని వివరాలను జాగ్రత్తగా చూస్తూ ప్రతి కొనుగోలుకూ బిల్లు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.