: గల్ఫ్ లో రూ. 1400 కోట్లు... మట్టిపాలైపోయినట్టే!
గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారతీయుల వద్ద కొద్దిపాటి మొత్తంలో ఉండే డబ్బును అక్కడి ఎక్స్ఛేంజ్ సంస్థలు మార్చేందుకు అంగీకరించకపోవడంతో దాదాపు రూ. 1400 కోట్లు మట్టిపాలైపోయినట్టేనని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ డబ్బంతా, గల్ఫ్ లో ఉంటూ సంవత్సరానికి ఒకసారో, రెండుసార్లో ఇండియాకు వచ్చీపోయే వారి దగ్గరున్నదే. వ్యక్తిగతంగా చూస్తే, ఒక్కొక్కరి వద్దా ఉండే మొత్తం అతి తక్కువే అయినా, గల్ఫ్ దేశాల్లోని 70 లక్షల మందిలో ఒక్కొక్కరి వద్ద రూ. 2 వేలు ఉన్నాయని అనుకుంటే, ఈ మొత్తం రూ. 1,400 కోట్లవుతుంది. ఈ రెండు వేల మార్పిడి కోసం ఎవరూ ఇండియాకు రావాలని అనుకోరు. అలాగని అరబ్ దేశాల్లో మార్చుకునే వీల్లేదు. అక్కడున్న భారతీయ బ్యాంకులు గల్ఫ్ చట్టాల ప్రకారమే పనిచేస్తుంటాయి కాబట్టి, భారత కరెన్సీని తాము స్వీకరించలేమని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఈ సొమ్మంతా పనికిరాకుండా పోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.