: ఎన్నారైలు, పర్యాటకుల నోట్ల కష్టాలపై స్పందించిన ప్రభుత్వం.. మంత్రుల కమిటీ ఏర్పాటు
పెద్ద నోట్ల రద్దుతో ఎన్నారైలు, విదేశీ పర్యాటకులు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వం స్పందించింది. వారు లేవనెత్తిన అనుమానాలపై దృష్టిసారించిన ప్రభుత్వం గురువారం మంత్రులతో కూడిన అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. కాన్సులర్, వీసా ఫీజులకు పాత నోట్లను తీసుకునేందుకు అనుమతించాలని, మరిన్ని నిధులను తీసుకునేలా అనుమతించాలంటూ విదేశీ మిషన్లు ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. అలాగే నోట్ల రద్దుతో ఎన్నారైలు, పర్యాటకులు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆర్థిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో మంత్రులతో కూడిన అంతర్గత కమిటీని ఏర్పాటు చేసినట్టు విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వికాశ్ స్వరూప్ తెలిపారు. దేశంలోని కొన్ని విదేశీ మిషన్లు కాన్సులర్, వీసా ఫీజులపై ఉన్న సందేహాలను తీర్చాలని అడిగాయని ఆయన పేర్కొన్నారు. కాన్సులర్, వీసా ఫీజులకు పాత నోట్లను కనుక అంగీకరిస్తే వాటిని తిరిగి ఎలా మార్చుకోవాలనే సందేహం వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఇక విదేశాల్లో ఉన్న ఎన్నారైలు తమ వద్ద ఉన్న పాత నోట్లను ఇప్పటికిప్పుడు వచ్చి మార్చుకునే అవకాశం లేకపోవడంతో వాటి పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోందని అన్నారు. అలాగే విదేశాల్లో ఉన్న ద్రవ్య మార్పిడి అసోసియేషన్ల సంగతి ఏంటో కూడా తెలియక ఇవే ప్రశ్నలు అడుగుతున్నారని వికాశ్ స్వరూప్ వివరించారు. వారి నుంచి వచ్చిన సందేహాలను నివృత్తి చేసేందుకు ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.