: భారత కరెన్సీని వదిలేస్తున్న అసోం వాసులు!


అర్చనా తమాంగ్... 35 సంవత్సరాల మహిళ. అసోంలోని భూటాన్ సరిహద్దు ప్రాంతంలోని హతిసోర్ గ్రామంలో ఫోటో స్టూడియో నిర్వహిస్తూ పొట్టపోసుకుంటున్న మహిళ. ఇండియాలో పెద్ద నోట్ల రద్దు తరువాత, కరెన్సీ కష్టాలు చుట్టుముట్టడం, చిల్లర నోట్లకు తీవ్ర కొరత ఏర్పడటంతో వ్యాపారం మందగించింది. అయితే, నగదు కష్టాల నుంచి ఈ ప్రాంతం త్వరగానే బయటపడింది. ఎలాగంటే సమీపంలోని భూటాన్ కరెన్సీని మరింత విరివిగా వాడుతుండటమే. వాస్తవానికి ఈ ప్రాంతంలో భూటాన్ కరెన్సీ దాదాపు భారత కరెన్సీతో సమానంగా చలామణిలో ఉంటుంది. రూపాయితో పోలిస్తే మారకపు విలువ తక్కువే అయినా, ప్రజల వద్ద భూటాన్ నోట్లు కనిపిస్తూనే ఉంటాయి. సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల్లో ఈ నోట్లను రిటైల్ వ్యాపారులు తీసుకుంటూనే ఉంటారు. తిరిగి వీటిని భూటాన్ వెళ్లి తమకు కావాల్సిన సరుకులు కొనుగోలు చేసే వేళ మార్చుకుంటుంటారు. "ఈ ప్రాంతంలో భూటాన్ కరెన్సీ చెల్లుబాటులో ఉండటం ఓ రకంగా మాకు అదృష్టమే. ఈ ప్రాంతంలో ఓ బ్యాంకు లేదు. ఓ ఏటీఎం లేదు. ఇప్పటివరకూ ఇండియాలో విడుదలైన కొత్త కరెన్సీని మేము చూడలేదు కూడా. ఓ రకంగా ఈ ప్రాంతంలో భారత కరెన్సీని వదిలేసినట్టే" అని అర్చన వ్యాఖ్యానించారు. దగ్గరలోని బ్యాంకు శాఖ 50 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పిన ఆమె, ఎస్బీఐకి చెందిన డిపాజిట్ వ్యాన్ వారానికి మూడు సార్లు వచ్చి డిపాజిట్లను తీసుకెళుతుందని తెలిపారు. కాగా, ఈ ప్రాంతానికి వచ్చే వారంలో కొత్త నగదును పరిచయం చేస్తామని అధికారులు చెబుతుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News