: తొలి రోజు మనదే... టీమిండియా 317/4
విశాఖపట్టణంలోని ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో తొలి రోజు టీమిండియా సత్తాచాటింది. తొలి రోజు ఆటలో బ్యాటింగ్ పిచ్ అయిన విశాఖలో టీమిండియా టాప్ ఆటగాళ్లు ఛటేశ్వర్ పుజారా (119), విరాట్ కోహ్లీ సెంచరీలతో సత్తా చాటారు. వీరిద్దరి అద్భుతమైన భాగస్వామ్యంతో టీమిండియా తొలిరోజు పటిష్ఠ స్థితిలో నిలిచింది. కాగా, టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) ఆదిలోనే అవుటై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. మురళీ విజయ్ (20) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. దీంతో టీమిండియా కేవలం 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో క్రీజులో పుజారాకు కోహ్లీ జతకలిశాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ, సాధికారిక ఆటతీరు ప్రదర్శించారు. ఈ క్రమంలో ఇద్దరూ సెంచరీలతో విరుచుకుపడ్డారు. పుజారా 204 బంతుల్లో 2 సిక్సర్లు, 12 ఫోర్లతో 119 పరుగులు సాధించి, పరుగుల గేర్ మార్చే క్రమంలో అవుటయ్యాడు. దీంతో కోహ్లీకి జత కలిసిన అజింక్యా రహనే (23) నిలదొక్కుకుంటున్న దశలో అవుటై నిరాశపరిచాడు. దీంతో విరాట్ కోహ్లీకి, రవిచంద్రన్ అశ్విన్ (1) జతకలిశాడు. కాసేపటికే తొలి రోజు ఆటముగిసింది. దీంతో ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా 317 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 241 బంతుల్లో 15 బౌండరీలతో 151 పరుగులు చేయగా, అశ్విన్ జతగా ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ మూడు వికెట్లతో రాణించగా, బ్రాడ్ ఒక వికెట్ తో సహకారమందించాడు.