: నిరుపేద మాల్యాకు అప్పు రద్దు చేశారు... మోదీసాబ్! ఈ కోట్ల రూపాయలు ఎవరికి దోచిపెడతారు?: ప్రశ్నించిన కేజ్రీవాల్


దేశ ప్రజలందరినీ క్యూలైన్లలో నిలబెట్టి, వేల కోట్ల రూపాయల పెట్టుబడిదారుల అప్పులను మొండి బకాయిల పేరిట రద్దు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిలదీశారు. ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండీలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజలందర్నీ బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలైన్లలో నిలబెట్టిన ప్రధాని... విజయ్ మాల్యా అప్పును మాత్రం రద్దు చేశారని అన్నారు. పేద ప్రజలు వ్యవసాయ రుణాలు సకాలంలో తీర్చకపోతే...జప్తు పేరట ముక్కుపిండి వసూలు చేసే బ్యాంకులు... వారికంటే నిరుపేదలనా, విజయ్ మాల్యా, ఇతర పరిశ్రమల యజమానుల అప్పులు రద్దు చేశాయి? అని ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయలతో విజయ్ మాల్యాను దేశం దాటించిన ప్రధాని మోదీ...ఇప్పుడు బ్యాంకుల్లో డబ్బు జమ చేయాలంటూ లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి బ్యాంకుల్లో పెట్టేలా చేస్తున్నారని, తిరిగి ఈ డబ్బుతో ఎవరి అప్పులు మాఫీ చేయాలనుకుంటున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బ్యాంకుల్లో డబ్బును దోచుకుంటున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆయన నిలదీశారు. ప్రధాని స్నేహితులను ఆదుకునేందుకు ఈ ఎత్తుగడ వేశారని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News