: పెద్దనోట్ల రద్దు ప్రభావంతో విమానయాన సంస్థలకు తీవ్రంగా నష్టాలు
నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల నిర్ణయం అంశం విమానయాన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అకస్మాత్తుగా టిక్కెట్స్ బుకింగ్స్ తగ్గిపోయాయి. ఖాళీగా కనిపిస్తోన్న సీట్లను నింపుకునే పనిలో విమానయాన సంస్థలు ప్రయాణికులకు స్పెషల్ స్కీమ్స్ను ప్రవేశపెట్టి ఆకర్షించాలని చూస్తున్నాయి. లోకాస్ట్ ఎయిర్లైన్ గా పేరున్న సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన స్కూట్ సంస్థకు 10 శాతం బుకింగ్స్ పడిపోయాయని తెలిపింది. ఐలాండ్ నుంచి ఇండియాలోని జైపూర్, అమృత్సర్, చైన్నై ప్రాంతాలకు వెళ్లే విమానాల కోసం చేసుకునే బుకింగ్స్‌లో ఒక్కరోజులో ఈ తేడా కనిపించిందని చెప్పాయి. సింగపూర్ ఎయిర్లైన్కు చెందిన మరో బడ్జెట్ ఎయిర్లైన్ టైగర్ది కూడా ఇదే పరిస్థితి అని ఆ సంస్థ అధికారులు చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రమోషనల్ రేట్ల ఆఫర్ ప్రవేశపెట్టాలని చూస్తున్నామని, అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ట్రావెల్ డిమాండ్ దారుణంగా దెబ్బతిందని సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన స్కూట్ సంస్థ అధికారులు తెలిపారు. దీంతో తాము డిసెంబర్ నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలనుకుంటున్నామని చెప్పారు. లగ్జరీ ట్రావెల్ డిమాండ్ కూడా తగ్గినట్టు విమానయాన సంస్థలు పేర్కొన్నాయి. విమానయానం చేయాలనుకుంటున్న చిన్న పట్టణాల్లో నివసించే ప్రయాణికులు అధికంగా నగదు రూపంలోనే టిక్కెట్ తీసుకుంటారని, పెద్దనోట్ల రద్దుతో వారు విమానయానం చేయడానికి ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు.