: మా జవాన్లను చంపామని పాక్ పచ్చి అబద్ధాలు చెబుతోంది: భారత సైన్యం
వాస్తవాధీన రేఖ వెంబడి జరిపిన కాల్పుల్లో 11 మంది భారత జవాన్లను హతమార్చామని పాకిస్థాన్ చేసిన ప్రకటనను భారత సైన్యం ఖండించింది. ఈ విషయంలో పాకిస్థాన్ పచ్చి అబద్ధాలు చెబుతోందని, ఈ నెల 14, 15, 16 తేదీల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పలుమార్లు ఉల్లంఘించిందని, అయితే, కాల్పుల్లో ఎవరూ పెద్దగా గాయపడలేదని నార్త్ రన్ కమాండ్ పేర్కొంది. పాక్ ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ, 14న భారత పోస్టులపై దాడులు చేసి 11 మందిని చంపామనడం అవాస్తవమని తెలిపింది. కాగా, బుధవారం నాడు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ మేనేజర్ రహీల్ షరీఫ్ మాట్లాడుతూ, భారత్ కాల్పుల్లో ఏడుగురు పాక్ జవాన్లు అమరవీరులయ్యారని, ప్రతిగా పాక్ చేసిన దాడిలో 11 మంది హతమయ్యారని చెప్పిన సంగతి తెలిసిందే. వాస్తవానికి 40 నుంచి 44 మంది వరకూ మరణించి వుండవచ్చని భావిస్తున్నామని, మృతుల లెక్క అధికారికంగా తేలాల్సి వుందని రహీల్ పేర్కొన్నారు. భారత్ నిజాలు దాచకుండా తమ సొంత సైన్యం లెక్కల విషయంలో వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు.