: ఆసీస్ క్రికెట‌ర్ల‌ను ఉతికి పారేసిన మీడియా.. స‌ఫారీల చేతిలో ఓట‌మిని జీర్ణించుకోలేక‌ తిట్ల దండ‌కం


ద‌క్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా జ‌ట్టు ఘోర ప‌రాజ‌యాన్ని ఆ దేశ మీడియా జీర్ణించుకోలేకపోతోంది. క్రికెటర్ల‌పై దుమ్మెత్తి పోసింది. తిట్ల దండ‌కంతో శాప‌నార్థాలు పెట్టింది. జ‌ట్టు వ‌రుస ఓట‌ముల‌పై కెప్టెన్ నుంచి ఆట‌గాళ్ల వ‌ర‌కు స‌మాధానం చెప్పేవారే క‌రవ‌య్యారంటూ విమ‌ర్శ‌లు గుప్పించింది. హోబ‌ర్డ్ వేదిక‌గా స‌ఫారీల‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఆతిథ్య ఆసీస్ జ‌ట్టు ఇన్నింగ్స్ 80 ప‌రుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. తొలి టెస్టులోనూ 177 ప‌రుగుల తేడాతో ప‌రాభ‌వం మూట‌గ‌ట్టుకున్న ఆసీస్ రెండో టెస్టులోనూ ఘోరంగా ఓడిపోవడాన్ని ఆసీస్ మీడియా త‌ట్టుకోలేక‌పోతోంది. దీనికితోడు ఇటీవ‌ల శ్రీ‌లంక ప‌ర్యట‌న‌లోనూ లంకేయుల చేతిలో ఆస్ట్రేలియా జ‌ట్టు ఓట‌మి పాలైంది. 0-3తో వైట్ వాష్ అయింది. జ‌గ‌జ్జేత‌గా వ‌రుస విజ‌యాల‌తో ప్ర‌త్య‌ర్థుల‌కు వ‌ణుకు పుట్టించిన ఆస్ట్రేలియా జ‌ట్టు వ‌రుస‌గా ఓట‌మి పాల‌వుతుండ‌డంతో త‌ట్టుకోలేక‌పోయిన మీడియా ఆట‌గాళ్ల‌ను చీల్చి చెండాడింది. 'సిడ్నీమార్నింగ్ హెరాల్డ్' ప‌త్రిక 'అవ‌మాన‌క‌రం' అంటూ శీర్షిక పెట్ట‌గా, 'ది ఆస్ట్రేలియ‌న్' ప‌త్రిక 'డిస్‌గ్రేస్ టు బ్యాగీ గ్రీన్' అనే శీర్షిక పెట్టి జ‌ట్టు తీరును తీవ్రంగా విమ‌ర్శించింది. ఇక సిడ్నీ డైలీ టెలిగ్రాఫ్ ప‌త్రిక అయితే ప‌రిణితి లేని బృందం అనే హెడ్డింగ్ పెట్టింది. ఆస్ట్రేలియా క్రికెట‌ర్లకు వెన్నెముక లేద‌ని క్రికెట్ ర‌చ‌యిత రాబ‌ర్ట్ క్రాడ‌క్ ధ్వ‌జ‌మెత్తాడు. ఆస్ట్రేలియా జ‌ట్టు గ‌త 30 ఏళ్ల‌లో ఎన్న‌డూ ఎదుర్కోని అతిపెద్ద సంక్షోభం ఎదుర్కొంటోంద‌ని ప‌లు ప‌త్రిక‌లు పేర్కొన్నాయి. నాణ్య‌త‌లేని ఆట‌గాళ్ల‌పై అన‌వ‌స‌రంగా డ‌బ్బులు వెచ్చిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించాయి. జ‌ట్టు కూర్పును వేగంగా మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాయి. జ‌ట్టు ఆట‌తీరుపై ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని రాశాయి.

  • Loading...

More Telugu News