: పన్ను ఎగ్గొడుతున్న వారికి మోదీ ఎప్పుడో వార్నింగ్ ఇచ్చారు: రాజ్యసభలో వెంకయ్య
పన్ను ఎగ్గొడుతున్న వారికి ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడో వార్నింగ్ ఇచ్చారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ రోజు రాజ్యసభలో ఆయన పెద్దనోట్ల రద్దు అంశంపై మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం దేశంలో నల్లధనాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. ప్రజల దృష్టిని మరలించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తాము చెందుతున్న ఆందోళన నుంచి బయటకు రావాలని, నిజానిజాలను పరిశీలించాలని సూచించారు. భారతీయులు ఎవ్వరూ మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రశ్నించడం లేదని వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలో ఎన్నికలంటే పోటీ చేసే అభ్యర్థులు ఖర్చు పెట్టే డబ్బు, నల్లధనం వినియోగం అనే అంశమే ఉంటుందని, ఆ స్థితి భారత్ నుంచి వెళ్లిపోవాలని అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో ప్రజల్లో కొన్ని వదంతులు వ్యాపించాయని చెప్పారు. ప్రధాని ప్రవేశపెట్టిన జన్‌ధన్ అకౌంట్లతోనే సామాన్యులకి బ్యాంకు అకౌంట్ల గురించి తెలిసిందని చెప్పారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఎంతో ఓపిక చూపిస్తున్నారని వెంకయ్యనాయుడు అన్నారు. వారంతా భారత భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఆలోచిస్తున్నారని, వారు బ్యాంకుల ముందు క్యూ కట్టడం లేదని, భారత భవిష్యత్తు కోసం క్యూ కడుతున్నారని వ్యాఖ్యానించారు. 50 రోజులు ఓపిక పట్టాలని, ఎందుకింత హడావుడి చేస్తున్నారని ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు అంశంలో ఆందోళన అవసరం లేదని తెలిపారు.