: పెద్దనోట్ల రద్దుతో అవినీతి ఆగుతుందని అనుకుంటున్నారా?: రాజ్యసభలో సీతారాం ఏచూరి
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 500, 1000 రూపాయల పాత నోట్ల రద్దుతో అవినీతి ఆగుతుందని అనుకుంటున్నారా? అని సీపీఎం రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రూ.2000 నోట్లతో నల్లధనం రెట్టింపు అవుతుందని ఆయన పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు అంశంలో రాజ్యసభలో ఆయన ప్రసంగిస్తూ... మరో 50 రోజుల పాటు ఓపిక పట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని, మరి అప్పటి వరకు ప్రజలు ఇబ్బందులు పడకుండా తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలు ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆసుపత్రులు, ట్రాన్స్ పోర్ట్, రైల్వే టికెట్ల కోసం కొన్ని రోజులు పాతనోట్లను చలామణీలో ఉంటాయని చెప్పిన ప్రభుత్వం, ఆ తరువాత ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయాలను తెలపాలని సీతారాం ఏచూరి అన్నారు. మరోవైపు, ఏటీఎం కేంద్రాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవని ఆయన విమర్శించారు. ఉగ్రవాదులకు నిధులు అందకుండా కేంద్ర ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకుందో చెప్పాలని ఆయన అన్నారు. మోదీ ఇప్పుడు కరెన్సీ నోట్లు వాడకూడదంటున్నారని, అంతటా కార్డులే వాడాలని సూచిస్తున్నారని ఆయన అన్నారు. 86 శాతం నగదును రద్దు చేసి 14 శాతమే వాడమని చెబుతున్నారని.. అయితే, 80 శాతం ప్రజల వద్ద కార్డులే లేవని ఆయన చెప్పారు.