: తాపీ మేస్త్రీ అకౌంట్లో రూ. 62 లక్షలు జమ... అకౌంట్ బ్లాక్ చేసిన బ్యాంక్


పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా ఎన్నో విచిత్రాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో తాజాగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఓ తాపీ మేస్త్రీకి చెందిన బ్యాంక్ అకౌంట్ లోకి అతనికి తెలియకుండానే రూ. 62 లక్షలు డిపాజిట్ అయ్యాయి. ఎన్నడూ లేని విధంగా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు జమ అయ్యే సరికి... బ్యాంకు అధికారులు ఆ అకౌంట్ ను బ్లాక్ చేశారు. ముంబైలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్న అనిల్ కుమార్ ఈ అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. అంతకు ముందు అతని అకౌంట్లో కేవలం రూ. 7 వేలు మాత్రమే ఉండేది. దీపావళికి సొంత ఊరికి వెళ్లాడు. ఏటీఎం సెంటర్ వాళ్ల ఊళ్లో లేకపోవడంతో, టికెట్ కోసం వాళ్ల ఊరి సర్పంచ్ వద్ద నుంచి రూ. 200 చేబదులు తీసుకున్నాడు. తీరా ముంబై వచ్చాక ఏటీఎంకు వెళ్లి డబ్బు డ్రా చేయబోతే... అకౌంట్ క్లోజ్ అయిందని మెసేజ్ వచ్చింది. అంతేకాదు, అకౌంట్లో రూ. 62 లక్షలు జమ అయ్యాయని, అంత సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పాలని ఫోన్ కు మెసేజ్ వచ్చింది. వెంటనే బ్యాంకుకు వచ్చి వివరాలు ఇవ్వాలని అందులో ఉంది. అంతేకాదు, బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి ఫోన్ కూడా వచ్చింది. దీంతో, బ్యాంకుకు వెళ్లిన అనిల్... ఆ డబ్బుకు, తనకు సంబంధం లేదని, తన సొంత సొమ్మును డ్రా చేసుకునేందుకు మాత్రమే అనుమతిస్తే చాలని బ్యాంకు అధికారులను వేడుకున్నాడు. ఈ డబ్బు బదిలీ అయిన సమయంలో తాను ముంబైలో లేనని, తన సొంతూరులో ఉన్నానని చెప్పాడు. దీంతో, ఈ విషయం మొత్తం పేపర్ మీద రాసి, గ్రామ సర్పంచ్ తో సంతకం చేయించుకుని రమ్మని బ్యాంకు అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో, తన వద్ద డబ్బు అసలు లేదని, తండ్రి ఆరోగ్యం బాగాలేదని, ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన సమయంలో ఇలా జరిగిందని అనిల్ వాపోయాడు.

  • Loading...

More Telugu News