: నేడే ఢిల్లీలో దీదీ ర్యాలీ... శివసేన మద్దతు.. ఇరుకునపడ్డ బీజేపీ!
500, 1000 రూపాయల నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండడం విశేషం. ఇదే సమయంలో కేంద్రంలో బీజేపీ మిత్రపక్షం శివసేన పాల్గొననుండడం ఆసక్తి రేపుతోంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్ హౌస్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఆమె ర్యాలీ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఆకస్మిక నిర్ణయం పట్ల ఆమె నిప్పులు చెరగనున్నారు. ప్రధానంగా పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి ముందు తమ రాష్ట్ర బీజేపీ శాఖ అధికారిక అకౌంట్ లో భారీగా నగదు డిపాజిట్ కావడంపై అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నారు. తమ పార్టీకి ఎలాంటి నష్టం కలుగకుండా కేంద్రం చర్యలు తీసుకుని, వ్యూహాత్మకంగా పెద్దనోట్లను రద్దు చేసిందని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆమె పలు సాక్ష్యాలు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీదీతో శివసేన గొంతుకలపడం బీజేపీని ఇబ్బంది పెట్టే అంశమేననడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ర్యాలీపై శివసేన చీఫ్ ఉద్ధవ్ ధాకరే మాట్లాడుతూ, నల్లధన నిర్మూలనకు కేంద్రం చేపట్టిన చర్యలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సమస్య కాదని, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న సమస్య అని అన్నారు. ఈ విషయంలో మమతా బెనర్జీతో కలిసి నడుస్తామని ఆయన ప్రకటించారు. దీనిపై ఆమెతో కలిసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తామని ఆయన ప్రకటించారు.