: డొనాల్డ్ ట్రంప్ కి ఫోను చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటీవలే విజయ దుందుభి మోగించిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌కి తన ప్రత్యర్థి దేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఆ తరువాత ఇరువురు నేతలు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలతో పాటు, పలు అంశాల గురించి చర్చించుకున్నారని ట్రంప్ తరఫున విడుదలైన ఓ ప్రకటన పేర్కొంది. రష్యాతో సత్సంబంధాలు కొనసాగించడానికి తాము కూడా ఎదురుచూస్తున్నామని పుతిన్‌కి ట్రంప్ చెప్పారు. అమెరికా, రష్యా మధ్య ప్రస్తుతం సత్సంబంధాలు సరిగాలేవని ఇరువురు నేతలూ ఒప్పుకున్నారని, ఇరు దేశాల మధ్య సాధారణ స్థితి వచ్చేందుకు కృషి చేయాలని మాట్లాడుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. అంతేగాక, ట్రంప్, పుతిన్ వ్యక్తిగతంగా కలుసుకొని మాట్లాడుకునేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన వెంటనే పుతిన్ టెలిగ్రామ్ ద్వారా కూడా ఆయనకు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే.