: ట్రంప్ మంచివారే... ఇండియాకు మేలు చేస్తారు: మోదీ
అమెరికా అధ్యక్షుడిగా మరో రెండు నెలల్లో బాధ్యతలు స్వీకరించబోయే డొనాల్డ్ ట్రంప్ తనకు మిత్రుడేనని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక బంధంలో ఏ విధమైన మార్పులూ జరగబోవని, ట్రంప్ హయాంలో ఈ బంధం మరింతగా బలపడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇచ్చిన విందుకు హాజరైన మోదీ ఇతర నేతలతో కొద్దిసేపు ముచ్చటించారు. ట్రంప్ సైతం భారత్ పట్ల సానుకూల ధోరణితోనే ఉన్నారని, గతంలో అమెరికాను రిపబ్లికన్లు పాలించిన సమయంలోనూ దృఢమైన స్నేహబంధం కొనసాగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం పాలిస్తున్న డెమోక్రాట్లతో పోలిస్తే, జార్జ్ బుష్ వంటి రిపబ్లికన్ల పాలనలోనే ఇండియాతో ద్వైపాక్షిక బంధం బలపడిందని ఆయన అన్నారు. డొనాల్డ్ ట్రంప్ మంచివారేనని, ఆయన హయాంలో ఇండియాకు మేలు కలుగుతుందని భావిస్తున్నానని మోదీ వ్యాఖ్యానించారు.