: నోట్ల రద్దుతో తెరపైకి పురాతన కాలం నాటి వస్తుమార్పిడి పద్ధతి.. తమ దగ్గర ఉన్నవి ఇచ్చి కావాల్సినవి తీసుకుంటున్న వైనం


అప్పుడెప్పుడో వస్తుమార్పిడి పద్ధతి ఉండేదని చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. అంతేతప్ప దాని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. తమ దగ్గర ఉన్నవి ఇచ్చి తమకు కావాల్సినవి తీసుకోవడమే వస్తు మార్పిడి పధ్ధతి. డబ్బులు చలామణిలోకి రాని రోజుల్లో ఇది విరివిగా ఉండేది. తర్వాత నాణేలు, ఆ తర్వాత నోట్ల ప్రవేశంతో వస్తుమార్పిడి పద్ధతి మాయమైంది. అయితే మోదీ పుణ్యమా అని మళ్లీ చాలా ప్రాంతాల్లో ఈ పద్ధతి తెరపైకి వచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న కిరాణాషాపు యజమానులు చాలా ప్రాంతాల్లో ప్రజలకు అప్పుపై కావాల్సిన సరుకులు అందిస్తున్నారు. జార్ఖండ్‌ ప్రజలకు అక్కడి స్థానిక కిరాణా షాపులు నోట్ల కష్టాల నుంచి విముక్తి కల్పించాయి. కావాల్సిన వస్తువులను అరువుపై ఇస్తున్నారు. తమ డబ్బులు ఎక్కడికీ పోవని, తిరిగి వచ్చేస్తాయని, కొన్ని రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నోట్ల ఇబ్బందులను దృష్టి పెట్టుకుని సరుకులను అప్పుగా ఇస్తున్నట్టు ప్రదీప్ ఒరాయన్ అనే వ్యాపారి తెలిపారు. తమ డబ్బులు వారి వద్ద భద్రంగానే ఉంటాయని అన్నారు. కొందరు తమ వద్ద ఉన్న వస్తువులను తెచ్చి తమకు అవసరమయ్యే వాటిని వస్తుమార్పిడి పద్ధతిపై పట్టుకెళ్తున్నట్టు ఆయన తెలిపారు. తమ దగ్గర ఉన్న కూరగాయలను మార్కెట్‌కు తీసుకువెళ్లి విక్రయించడం కంటే వాటిని షాపుల్లో ఇచ్చి కావాల్సిన సరుకులను తీసుకెళ్తున్నట్టు బోరెయా గ్రామానికి చెందిన రైతు దిను మహతో తెలిపారు. పొరుగు రాష్ట్రం ఒడిశాలోనూ ఇలాంటి పద్ధతే కనిపిస్తోంది. ఇక్కడి ప్రజలే ఒకరి దగ్గర ఉన్న వస్తువులను మరొకరు మార్చుకుంటూ నోట్ల మార్పిడి కష్టాల నుంచి బయటపడుతున్నారు. నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని, అయితే తాము అప్పు ఇచ్చేందుకు వెనకాడడం లేదని కంటబంజికి చెందిన వ్యాపారి సురతా బెహరా తెలిపారు. మరికొన్ని చోట్ల నోట్ల మార్పిడి విషయంలో ప్రజలు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. చాలా గ్రామాల్లో బ్యాంకులు లేకపోవడం, నోట్లు మార్చుకునేందుకు ఐదు, పది కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి రావడంతో అందరి వద్ద ఉన్న సొమ్మును ఓ వ్యక్తికి అప్పగించి అతడిని పంపి నోట్లు మార్చుకుంటున్నారు. అయితే ఇందులో కొంత ప్రమాదం కూడా లేకపోలేదని, అయినా తప్పడం లేదని బలింగిర్ జిల్లాలోని కంటబంజి టౌన్‌షిప్‌కు చెందిన శివరామ్ భట్ తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ ప్రజలు ఇలా ఒకరికొకరు సహకరించుకుంటూ నోట్ల మార్పిడి కష్టాల నుంచి తాత్కాలికంగా బయటపడుతున్నారు.

  • Loading...

More Telugu News