: చెక్ రిపబ్లిక్ కు నన్ను అంబాసిడర్ ను చెయ్యండి: డొనాల్డ్ ట్రంప్ ను డిమాండ్ చేసిన మాజీ భార్య
ఇవానా... డొనాల్డ్ ట్రంప్ రెండో భార్య. 1992లో ట్రంప్ నుంచి విడాకులు తీసుకున్న తరువాత, ఓ డేటింగ్ రియాల్టీ షో, కామెడీ షోలను నిర్వహిస్తూ పాప్యులర్ అయిన ఇవానా, ఇప్పుడు తన మాజీ భర్త ముందు కొత్త డిమాండ్ ను ఉంచింది. తాను 1949లో పుట్టిన చెక్ రిపబ్లిక్ (గతంలో చెకోస్లోవేకియా)కు అమెరికా తరఫున తనను దౌత్యాధికారిగా నియమించాలని కోరుతోంది. ప్రస్తుతం 67 ఏళ్ల వయసులో ఉన్న ఇవానా, న్యూయార్క్ పోస్టుకు ఇంటర్వ్యూ ఇస్తూ, తన మాజీ భర్త తనను తన సొంత దేశానికి అంబాసిడర్ గా నియమించాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. "నేను మూడు పుస్తకాలు రాశాను. అవి 40 దేశాల్లోని 25 భాషల్లోకి అనువాదమయ్యాయి. నా పేరు ఇవానా. నా పేరు పక్కన ట్రంప్ అని ఉండక్కర్లేదు. నేను అమెరికా అధ్యక్షుడి వెంట పడాలని అనుకోవడం లేదు కూడా. నేను చెక్ మాట్లాడగలను. ఆ దేశంలో నేను అందరికీ తెలుసు కూడా. ఇంతకన్నా అర్హతలేం కావాలి?" అని ఆమె ప్రశ్నించారు. తనను చెక్ రిపబ్లిక్ కు అంబాసిడర్ ను చేయాలని అన్నారు.