: కేవలం పది నిమిషాల్లోనే ఏకంగా 2,000 ఉప్పు బస్తాలు అమ్ముడుపోయాయి.. ఒక్కో బస్తా రూ.500!
ఇటీవలే రద్దయిన పెద్ద నోట్ల ప్రభావంతో ఉప్పు కొరత ఏర్పడిందని, ధర విపరీతంగా పెరిగిపోతోందని ఎన్నో వదంతులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పుకార్ల ప్రభావమేనేమో.. తమిళనాడులోని పళ్లిపట్టులో నిన్న రాత్రి జరిగిన సంతలో విపరీతంగా ఉప్పు బస్తాలు అమ్ముడుపోయాయి. అదికూడా కేవలం పది నిమిషాల్లోనే ఏకంగా 2,000 ఉప్పు బస్తాలు అమ్ముడుపోయాయి. పళ్లిపట్టులో జరిగిన ఈ సంతకు అక్కడి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 50 గ్రామాల ప్రజలు వచ్చారు. సాధారణంగా అక్కడకు ప్రజలు కూరగాయలు కొనడానికి వెళతారు. అయితే, నిన్న దాదాపు పది వేల మంది సంతకు వచ్చారు. ఒక్కసారిగా నిన్న రాత్రి 9 గంటల సమయంలో అక్కడి ప్రతీ దుకాణంలో ఉప్పు బస్తాలు కొనడానికి పోటీ పడ్డారు. ఏ షాపు వద్ద చూసినా 20 నుంచి 30 మంది ఉప్పు బస్తాల కోసం ఎగబడ్డారు. ఒక్కొక్కరు రెండు, మూడు బస్తాల ఉప్పు కొనుక్కొని వెళ్లారు. వినియోగదారుల తాకిడి అధికమవడంతో అదో అవకాశంగా తీసుకున్న వ్యాపారులు ధర పెంచి విక్రయించారు. 85 రూపాయలకే లభించే 25 కిలోల ఉప్పు బస్తా ధర ఒక్కసారిగా రూ.500 వరకు పెంచేశారు. అయినప్పటికీ వినియోగదారులు వెనకాడలేదు. 2,000 బస్తాల ఉప్పును కొనుక్కొని తీసుకెళ్లారు. ఆ తరువాత రాత్రి 10 గంటలకు అక్కడి సరిహద్దులోని ఏపీకి చెందిన కొందరు తమ ద్విచక్ర వాహనాలపై ఉప్పు కోసం అక్కడకు రావడం విశేషం. ఈ అంశంపై మీడియా వ్యాపారులను విచారించగా ఉప్పుకు ఎలాంటి డిమాండ్ లేదని చెప్పారు. కావలసినంత ఉప్పు ఉందని, ఇంకా కావాలంటే దిగుమతి చేసుకునే పరిస్థితులు కూడా పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. అయినప్పటికీ ఉప్పుకోసం ప్రజలు ఎగబడి, ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోవడం గమనార్హం.