: నేను దేశద్రోహిని, ఉగ్రవాదిని కాను.. నా పాదయాత్రను అడ్డుకోకండి: ముద్రగడ ఆగ్రహం
కాపులకు ప్రత్యేక రిజర్వేషన్ల కోసం మరో పోరాటానికి దిగుతానని ఇటీవల ప్రకటించిన మాజీ మంత్రి, కాపు ఐక్య వేదిక నేత ముద్రగడ పద్మనాభం అందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో తన ఇంట్లో ఈ రోజు కాపు జేఏసీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. 13 జిల్లాల కాపు జేఏసీ నేతలు సమావేశమయిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఈనెల 16 న నిర్వహించతలపెట్టిన పాదయాత్రను అడ్డకోకూడదని ప్రభుత్వానికి సూచించారు. తాను దేశద్రోహి, ఉగ్రవాదిని కాదని అన్నారు. తాను తన జాతి కోసం సత్యాగ్రహ పద్ధతిలో పాదయాత్ర చేయనున్నానని, ఆమాత్రం దానికి ఇంత భారీ పోలీసు బందోబస్తు ఎందుకని ప్రశ్నించారు. మరోవైపు ముద్రగడ పాదయాత్రపై స్పందించిన రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఉద్యమం పేరుతో ముద్రగడ ఆందోళనలు నిర్వహిస్తే ఏం జరుగుతుందో తమకు తెలుసని, ఇటీవల జరిగిన తుని లాంటి ఘటనలు మళ్లీ జరగనివ్వమని ముద్రగడ హామీ ఇస్తారా? అని ప్రశ్నించారు.