: తీరనున్న చిల్లర కష్టాలు.. కొత్త రూ.500 నోటు వచ్చేసింది... కొత్త నోటుతో సెల్ఫీలు వైరల్
పెద్దనోట్ల రద్దు తరువాత బ్యాంకులకు వచ్చి తమ పాత నోట్లను మార్పించుకుంటున్న ప్రజలకు ఇప్పటివరకు రూ.2000 కొత్త నోట్లు మాత్రమే బ్యాంకు సిబ్బంది అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కొన్ని బ్యాంకులకు ఐదు వందల నోట్లు చేరాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఈ రోజు రూ.500 కొత్త నోట్లను అందుకొని హర్షం వ్యక్తం చేశారు. రూ.2000 నోట్లు ఇచ్చినా వాటిని ఉపయోగించుకోలేక తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్న ప్రజలు కొత్తగా రూ.500 నోటు వచ్చేసిందని సంబరపడిపోతున్నారు. కొన్ని ఏటీఎంల ద్వారా 100, 50 రూపాయల నోట్లను ప్రజలు అందుకుంటున్నారు. అయితే, బ్యాంకు అధికారులు వాటిని ఏటీఎంలలో ఉంచిన వెంటనే అయిపోతోన్న విషయం తెలిసిందే. దేశంలోని పలు ప్రాంతాల్లోని బ్యాంకులకు ఈ కొత్త 500 రూపాయల నోట్లు చేరుకున్నాయి. త్వరలోనే రూ.500 రూపాయల నోట్లు అన్ని బ్యాంకుల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిన్నటి వరకు రూ.2000 నోటుతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ప్రజలు తాజాగా రూ.500 నోట్లను అందుకొని వాటితో సెల్ఫీలు దిగి పోస్టులు చేస్తున్నారు.