: ప్ర‌జ‌ల్లో ఉన్న‌ అశాంతి ఆగ్రహంగా మారే అవ‌కాశాలు ఉన్నాయి!: 'నోట్ల రద్దు' ఇబ్బందులపై అంబ‌టి రాంబాబు


దేశంలో పెద్ద నోట్లను ర‌ద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల దేశంలో ప‌రిస్థితులు అధ్వానంగా మారాయ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబ‌టి రాంబాబు అన్నారు. ఈ రోజు హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... సామాన్యుడు ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కుంటున్నాడ‌ని పేర్కొన్నారు. పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న చేస్తూ ప్రధాన‌మంత్రి నరేంద్ర మోదీ దేశంలో ఒక భయానక పరిస్థితిని సృష్టించారని ఆయ‌న అన్నారు. స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ప‌రిష్కారం క‌నుగొనాల‌ని ఆయ‌న చెప్పారు. పేద‌వారికి ఎందుకు ఈ సమస్యలు? అని అంబటి రాంబాబు ప్ర‌శ్నించారు. మోదీ పెద్ద‌ నోట్ల ర‌ద్దుపై ప్రకటన చేయ‌క‌ముందే ఈ విషయం కొంద‌రికి తెలిసింద‌ని ఆయ‌న అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ అంశంపై తెలిసిన తర్వాతే పెద్ద నోట్లను ర‌ద్దు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాసి ఉంటార‌ని అన్నారు. అంతేగాక‌, టీవీ ఛానెళ్ల‌ చర్చల్లోనూ ప‌లువురు ఈ విష‌యాన్ని గురించి మాట్లాడార‌ని అన్నారు. సామాన్యులు బ్యాంకుల వ‌ద్ద క్యూలో నిల‌బ‌డి ఉన్నా త‌మ‌కు డబ్బు వస్తుందో రాదో అని భయపడుతున్నారని అంబ‌టి రాంబాబు వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల్లో ఉన్న‌ అశాంతి ఆగ్రహంగా మారే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, ఆ త‌రువాత‌ ప్రమాదమేన‌ని అంబటి రాంబాబు అన్నారు. జ‌గ‌న్‌పై ఏపీ మంత్రి దేవినేని ఉమ అన‌వ‌స‌ర‌ ఆరోపణలు చేస్తున్నారని, అధికార పార్టీ నేత‌లు ఇకనైనా అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం మానుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

  • Loading...

More Telugu News