: అప్పుడు రద్దయిన వెయ్యి రూపాయల నోటు ధర ఇప్పుడు ఒక్కటి రూ.2.4 లక్షలు పలుకుతోంది!
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, భారత్‌లో 1978లోనూ పెద్ద నోట్లను రద్దు చేశారు. అప్పట్లో చలామణిలో ఉన్న రూ.1000, రూ.5000 రూ.10వేల నోట్లను అప్పటి భారత ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందుల కంటే ఆ సమయంలో మరింత అధికంగానే ప్రజలు కష్టాలు ఎదుర్కున్నారు. నోట్ల రద్దు సమయంలో అప్పట్లో కొందరు ఈ నోట్లలో కొన్నింటిని భద్రంగా దాచుకున్నారు. వాటిని తాజాగా వేలంలో అమ్ముతున్నారు. గణేశ్ లడ్డూల్లా అవి అధిక ధరకు అమ్ముడుపోతున్నాయి. మరుధర్ ఆర్ట్స్ అనే ఆక్షన్ హౌస్‌లో వేలానికి వేసిన ఈ నోట్లను కొనుక్కోవడానికి ప్రజలు ఉత్సాహం చూపుతున్నారని ఆ హౌస్ యాజమాన్యం తెలిపింది. అప్పటి వెయ్యి రూపాయల నోటు వేలంలో రూ.2.4 లక్షలు పలుకుతోందని తెలిపింది. అంతేగాక, అప్పట్లో రద్దు చేసిన ఐదు, పది వేల నోట్లను తాము ప్రైవేట్‌గా అమ్మకానికి పెడుతున్నట్లు పేర్కొంది. ఈ పెద్ద నోట్ల ధర రూ.30 లక్షలకు పైగా నిర్ణయించినట్లు తెలిపింది.