: అమెరికా తదుపరి అధ్యక్షురాలు కమలనే.. యూఎస్ మీడియాలో ఇండియన్-అమెరికన్ సెనేటర్‌పై విస్తృత విశ్లేషణలు


ఎన్నికలు ముగిసి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇంకా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారమైనా చేయనేలేదు. అప్పుడే అమెరికా భవిష్యత్ ప్రెసిడెంట్ ఎవరనే దానిపై యూఎస్ మీడియాలో విస్తృత చర్చ నడుస్తోంది. అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలయ్యే అవకాశాన్ని డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తృటిలో చేజార్చుకున్నారని, అయితే వచ్చేసారి ఆ అవకాశాన్ని ఇండియన్ అమెరికన్, సెనేటర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్(51)కి దక్కే అవకాశం ఉందని ఓ మీడియా తన నివేదికలో పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ను సమర్థంగా ఎదుర్కొనే సత్తా ఆమెకు మాత్రమే ఉందని అభిప్రాయపడింది. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కమల ఆయనను వదిలిపెట్టేది లేదని ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో రోజే కమల ఆయనపై విరుచుకుపడ్డారు. ఆయన విదేశాంగ విధానాలను తూర్పారబట్టారు. ట్రంప్‌పై ఆమె నిప్పులు చెరిగిన తర్వాతి రోజే పత్రిక ఆసక్తికర విశ్లేషణ చేయడం గమనార్హం. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా ఉపాధ్యక్షుడు జో బిడిన్ లాంటి ప్రముఖులంతా ఆమెవైపే ఉండడంతో 2020 ఎన్నికల్లో కమలను అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్టు ఆ పత్రిక తన నివేదికలో పేర్కొంది.

  • Loading...

More Telugu News