: నాలుగు గంటల్లోనే 20 టన్నుల ఉప్పును విక్రయించామంటున్న గుంటూరు వ్యాపారి


పెద్దనోట్ల రద్దు కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయనే వదంతుల కారణంగా ఉప్పు ప్యాకెట్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. ఉప్పు కొరత అంటూ నిన్న ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో మొదలైన వదంతులు తెలుగు రాష్ట్రాలకూ పాకాయి. అర్ధరాత్రి వరకు హైదరాబాద్ పాతబస్తీలోని రూ.300, రూ.400లకు ఉప్పు ప్యాకెట్లను అమ్మారు. అంతేకాకుండా, హైదరాబాద్ లోని బోరబండ, యూసుఫ్ గూడ, శ్రీరామ్ నగర్ లో కూడా ఈ వదంతుల ప్రభావం కొట్టొచ్చినట్లు కనపడింది. తాజాగా, నవ్యాంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఈ వదంతులు హల్ చల్ చేస్తున్నాయి. కొంజేటి లక్ష్మి పుల్లారావు అండ్ సన్స్ అనే ఉప్పు విక్రయించే దుకాణం వద్ద జనాలు బారులు తీరారు. అయితే, మామూలు ధరకే ఉప్పు బస్తాలను విక్రయిస్తున్నారు. ఉప్పు బస్తా రూ.170 గా ఉంది. ఈ విషయమై ఉప్పు కొనుగోలు చేసేందుకు వచ్చిన వారు మాట్లాడుతూ, ఉప్పు ధర పెరుగుతుందనే వార్తల కారణంగానే తాము కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా సదరు దుకాణం యజమాని మాట్లాడుతూ, సాధారణ రోజుల్లో మాదిరిగా రూ.170కే ఉప్పు బస్తాలను అమ్ముతున్నామన్నారు. తాము రోజుకు 20 టన్నుల ఉప్పు అమ్ముతామని, అలాంటిది, ఈ వదంతుల కారణంగా కేవలం నాలుగు గంటల్లోనే 20 టన్నుల ఉప్పును విక్రయిస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News