: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం... ఎస్ బీఐ ఉద్యోగులు దుర్మరణం
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బీఐ) ఉద్యోగులు దుర్మరణం చెందారు. కాన్పూర్-అమీర్ పూర్ హైవేపై నిన్న అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. గాటంపూర్ లో విధులు ముగించుకున్న బ్రాంచ్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్లు మారుతి ఒమ్ని వ్యాన్ లో వెళ్తుండగా, వేగంగా వస్తున్న కంటెయినర్ వారి వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో, అదుపు తప్పిన ఒమ్ని వాహనం పక్కనే ఉన్న కాల్వలో పడిపోయింది. అయితే, కంటెయినర్ వాహనం కూడా ఈ వ్యాన్ పై పడటంతో, అందులోని ఉద్యోగులు సహా వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయారు. క్రేన్ సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. కంటెయినర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.