: ఏజెంట్ల మోసం.. ‘సౌదీ’లో ఇంజనీరింగ్ ఉద్యోగమని చెప్పి బానిసను చేశారు!
మన దేశానికి చెందిన ఆటోమొబైల్ ఇంజనీర్ కు సౌదీ అరేబియాలో ఉద్యోగమిప్పిస్తామని చెప్పి, అక్కడి ఒంటెల వ్యాపారికి అమ్మేశారు. ఈ దారుణ సంఘటనకు సంబంధించిన వివరాలు... కోల్ కతాకు చెందిన జయంత బిశ్వాస్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఉద్యోగాల కోసం వెతుకుతున్న అతను ఈ ఏడాది జనవరిలో ముంబయి, ఢిల్లీకి చెందిన కొంతమంది ఏజెంట్లను సంప్రదించాడు. ఆటో మొబైల్ ఇంజనీర్ గా సౌదీ అరేబియాలో ఉద్యోగమిప్పిస్తామని చెప్పిన ఏజెంట్లు అతని వద్ద ఒక లక్ష రూపాయలు తీసుకున్నారు. అక్కడ ఉద్యోగం వచ్చాక, మూడు నెలల తర్వాత వర్క్ వీసా వస్తుందని జయంతకు చెప్పిన ఏజెంట్లు, టూరిస్ట్ వీసాతో సౌదీ అరేబియా విమానం ఎక్కించారు. ఆ మాటలు నమ్మిన జయంత మే15న అక్కడికి చేరుకున్నాడు. అయితే, అతనిని అక్కడి ఒక వ్యక్తికి సదరు ఏజెంట్లు అమ్మేశారు. దీంతో, జయంత బాధలు మొదలయ్యాయి. ఒంటెల ఫామ్ లో పని చేయిస్తూ అతనిని బానిసలా మార్చేశారు. ఒకపూటే తిండి తిని గడిపిన రోజులెన్నో అతని జీవితంలో ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడి నుంచి ఒకసారి పారిపోవడానికి యత్నించిన జయంతను పట్టుకున్న సంబంధిత వ్యక్తులు అతన్ని చితకబాదారు. తన వద్ద డబ్బు దొంగిలించాడంటూ జయంత పై సదరు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొన్ని రోజులు జైల్లో పెట్టారు. ఆ తర్వాత బయటకు వచ్చిన జయంత, ఈ విషయాన్ని తమ కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశాడు. అయితే, మొత్తానికి అక్కడి నుంచి బయటపడ్డ జయంత, సౌదీ రాజధాని రియాద్ లోని భారత దౌత్య అధికారులను సంప్రదించాడు. ఈ మేరకు స్పందించిన అధికారులు.. జయంత వివరాలను తెలుసుకున్నారు. అక్కడి ఎన్జీవోలో ఆశ్రయం కల్పించారు. ఇదిలా ఉండగా, ఈ విషయమై జయంత సోదరి గౌరి మాట్లాడుతూ, తన సోదరుడిని జైల్లో పెట్టిన విషయం తెలిసిన తర్వాత భయపడిపోయిన తాము, మళ్లీ ఇక్కడి ఏజెంట్లను కలిశామని, అతన్ని జైలు నుంచి విడిపించమని కోరగా ముప్ఫై ఐదు వేల రూపాయలు డిమాండ్ చేశారని చెప్పింది. సోదరుడి కోసం ఆ మొత్తాన్ని వారికి ఇచ్చామని, అక్టోబర్ 27న జయంతను జైలు నుంచి విడిపించారని ఆమె చెప్పింది. అయితే, జైలు నుంచి విడుదలైన జయంత మన దేశానికి ఎప్పుడొచ్చేదీ తెలియదని, ఈ నేపథ్యంలో తన తండ్రి రవీంద్రనాథ్ ఠాగూర్, భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ సాయం కోరినట్లు చెప్పింది. అయితే, ఈ విషయమై సుష్మా స్పందించాల్సి ఉందని ఆమె చెప్పింది. తన కుమారుడిని సాధ్యమైనంత తొందరగా భారత్ కు రప్పించాలని జయంత తల్లిదండ్రులు, సోదరి కోరారు.