: జువెలరీ షాప్స్ ను హెచ్చరించిన కేంద్రం
నల్ల ధనాన్ని అరికట్టే క్రమంలో రూ. 500, రూ. 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. కొత్త నోట్లు ఈ ఉదయం నుంచి జనాలకు అందుబాటులోకి వచ్చాయి. ఎంత మేర డబ్బు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో, నల్ల ధనాన్ని బంగారం వైపుకు మళ్లించేందుకు బ్లాక్ మనీగాళ్లు ప్రయత్నిస్తున్నారు. దీంతో, బంగారం దుకాణదారులకు కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పాన్ నంబర్ సమర్పించని వారికి బంగారం అమ్మకూడదంటూ వారిని హెచ్చరించింది. పాన్ నంబర్ తీసుకోకుండా బంగారం అమ్మితే, కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ సెక్రటరీ హన్ముఖ్ అధియా తెలిపారు. శుభకార్యక్రమాలకు డబ్బు తెచ్చుకుని, ఇంట్లో పెట్టుకున్న సామాన్యులు కూడా బంగారం కొనుగోళ్లను చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో, డిమాండ్ క్యాష్ చేసుకునేందుకు బంగారం వర్తకులు యత్నిస్తున్నారు. బంగారం ధరలను అమాంతం పెంచేశారు. కొన్ని దుకాణాల్లో తులం బంగారం ధర రూ. 50 వేలను కూడా తాకుతోంది.