: నోట్ల మార్పిడిపై దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
దేశాన్ని పట్టి పీడిస్తోన్న నల్లధనం, నకిలీనోట్లను అరికట్టడానికి రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీకి చెందిన అడ్వొకేట్ వివేక్ నారాయణ్ శర్మ, ఉత్తరప్రదేశ్ చెందిన అడ్వొకేట్ సంగంలాల్ పాండే వేసిన ఈ పిటిషన్ కొద్ది సేపటి క్రితం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో కేంద్రప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా పాత నోట్ల రద్దు, కొత్త నోట్ల చలామణి అంశంలో ఉత్తర్వులు ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది కోరారు. అయితే, వాదనలు విన్న అనంతరం నోట్ల మార్పిడిపై దాఖలైన ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌లో సమగ్రత లోపించిందని అందుకే తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.