: ట్రంప్ చిరకాలం వర్ధిల్లాలి... అమెరికాతో ఇక గొడవ పెట్టుకోం: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు


గత కొన్ని రోజులుగా అమెరికాకు వ్యతిరేకంగా ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు డుటెర్టె ప్రకటనలు చేస్తున్నారు. అమెరికా తన గౌరవాన్ని కోల్పోయిందని... బరాక్ ఒబామా నరకానికి పోతారని ఆయన గతంలో తీవ్ర విమర్శలు చేశారు. అయితే, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రావడంతో ఆయన ఇప్పుడు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇకపై అమెరికాతో కయ్యాలు మానుకుంటామని...ఎందుకంటే... ఇప్పుడక్కడ ట్రంప్ ఉంటారని చెప్పారు. అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ కు, తనకు చాలా విషయాల్లో సారూప్యత ఉందని డెటెర్టె చెప్పారు. ఎవరిమీదైనా విమర్శలు చేయడంలో తామిద్దరి తర్వాతే ఎవరైనా అని తెలిపారు. ట్రంప్ చిరకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మొదటి నుంచి కూడా ట్రంప్ ను డుటెర్టె సమర్థిస్తూనే వచ్చారు. అంతేకాదు, ట్రంప్ ను ముద్దుగా 'ట్రంప్ ఆఫ్ ది ఈస్ట్' అని సంబోధించారు.

  • Loading...

More Telugu News