: ట్రంప్ గెలుపుతో బెంబేలెత్తిపోతున్న పాకిస్థాన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంపై పాకిస్థాన్ బెంబేలెత్తిపోతోంది. పాక్ భవిష్యత్, అమెరికాతో సంబంధాల విషయంలో ట్రంప్ ఎలాంటి వైఖరి అనుసరించనున్నాడన్న దానిపై పాక్ ఆందోళన చెందుతోంది. ట్రంప్ గెలిచే అవకాశం లేదని సర్వేలు, విశ్లేషణలు హోరెత్తిన వేళ ధైర్యంగా ఉన్న పాక్... అనూహ్యంగా ఆయన అమెరికా అధ్యక్షుడిగా గెలవడంతో ఆ దేశంలోని ప్రముఖులు, విశ్లేషకులు భయపడిపోతున్నారు. కరుడుగట్టిన ముస్లిం వ్యతిరేకి అయిన ట్రంప్ పాకిస్థాన్ తో స్నేహహస్తం చాస్తాడా? చాచినా... గతంలో లాడెన్ ను మట్టుబెట్టిన రీతిలో ఉగ్రవాద నేతలను హతం చేసేందుకు ఆదేశాలు ఇస్తాడా? అంటూ ఆందోళనకు గురవుతున్నారు. పాకిస్థాన్ బలం ఉగ్రవాదులు, జీహాదీలకు ఆశ్రయం కల్పించడం. ఆ దేశంలోనే అత్యంత కిరాతకులైన ఉగ్రవాదులు పురుడుపోసుకుంటున్నారు. దీంతో పాక్ పట్ల ట్రంప్ కఠిన వైఖరి అవలంబిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని పాక్ భయపడుతోంది. దీంతో ట్రంప్ పాలన అనూహ్యంగా ఉంటుందని, పాక్ కు కష్టాలు తప్పవని పేర్కొంటున్నారు. అయితే పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ మాత్రం ఆశాభావం వ్యక్తం చేయడం విశేషం. ట్రంప్ కారణంగా దక్షిణాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయని పేర్కొంటున్నారు. దక్షిణాసియాలో శాంతి స్థాపనకు ట్రంప్ కృషి చేస్తారని ఆయన పేర్కొనడం విశేషం.