: వివాదాల నుంచి వైట్ హౌస్ వరకు... డొనాల్డ్ ట్రంప్


అమెరికా 45వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ కు సంచలనాలంటే మహా ఇష్టం. ఎవరేమనుకుంటే తనకేంటని... నిత్యం వివాదాలతోనే సహవాసం చేస్తుంటారాయన. అయితే, తాను అనుకున్నది సాధించాలనే పట్టుదల ఆయనలో చాలా అధికం. ఈ లక్షణమే అతడిని చివరకు అమెరికా అధ్యక్షుడిని చేసింది. 1946 జూన్ 14న న్యూయార్క్ లో ఫ్రెడ్ ట్రంప్, మేరీ ట్రంప్ దంపతులకు డొనాల్డ్ ట్రంప్ జన్మించారు. ఆయన తండ్రిలో జర్మనీ మూలాలు, తల్లిలో స్కాట్లండ్ మూలాలు ఉన్నాయి. ఆయన నలుగురు గ్రాండ్ పేరెంట్స్ కూడా యూరప్ కు చెందిన వారే. ఫ్రెడ్, మేరీలకు న్యూయార్క్ లో పరిచయం అయింది. వీరి వివాహం 1936లో జరిగింది. న్యూయార్క్ మిలిటరీ అకాడమీలో డొనాల్డ్ ట్రంప్ తన హైస్కూల్ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత బ్రోనెక్స్ లోని ఫార్డమ్ యూనివర్శిటీలో రెండేళ్లు చదివారు. అనంతరం పెన్సిల్వేనియా యూనివర్శిటీకి చెందిన వాటర్ లూన్ స్కూల్ నుంచి అర్థశాస్త్రంలో డిగ్రీ చేశారు. ట్రంప్ తొలుత పెన్సిల్వేనియాలో ఉన్న తమ కుటుంబ సంస్థ అయిన ఎలిజబెత్ అండ్ సన్స్ లో రియలెస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. 1971లో వ్యాపార పగ్గాలను చేపట్టిన ట్రంప్... తమ సంస్థ పేరును ది ట్రంప్ ఆర్గనైజేషన్ గా మార్చారు. అంతేకాదు, తన కార్యాలయాన్ని మన్ హట్టన్ కు షిఫ్ట్ చేశారు. 1978లో అక్కడ గ్రాండ్ హయత్ హోటల్ ను నిర్మించారు. ఆ తర్వాత ట్రంప్ ఓషన్ క్లబ్, ట్రంప్ టవర్ లాంటి ప్రముఖ భవనాలను నిర్మించారు. ఆ తర్వాత ప్లాజా హోటల్, అట్లాంటిక్ సిటీలో తాజ్ మహల్ కేసినోలను కొనుగోలు చేశారు. ప్రపంచ కుబేరుల్లో డొనాల్డ్ ట్రంప్ ది 324వ స్థానం. అమెరికా రాజకీయ చరిత్రలో అత్యంత సంపన్నుడు అనే ముద్ర ఆయనపై ఉంది. అయితే ఆయన విజయవంతమైన ఆర్థికవేత్తనా? కాదా? అనే విషయంలో కూడా సందిగ్ధత ఉంది. 1985 నుంచి 2016 వరకు యూఎస్ స్టాక్ మార్కెట్, న్యూయార్క్ ఆస్తి విలువను పోల్చుకుంటే... ట్రంప్ ఎదుగుదల కూడా సగటు స్థాయిలోనే ఉందని 'ది ఎకనమిస్ట్' అనే పత్రిక తెలిపింది. వ్యాపారంలో విజయాలే కాదు, బ్యాంకులకు అప్పుల ఎగవేత వంటి మరకలు కూడా ఆయనపై ఉన్నాయని తన కథనంలో తెలిపింది. ట్రంప్ హోటల్, కేసినోలు ఆరుసార్లు దివాలా తీసినా... వ్యక్తిగతంగా ఆయన ఏనాడూ దివాలా ప్రకటించలేదు. చట్టంలోని లొసుగులను వాడుకుని వ్యాపారం చేశానని... ఇది దివాలా తీయడం కాదని ట్రంప్ చెబుతారు. ట్రంప్ లో ఏ స్థాయి వ్యాపారవేత్త ఉన్నాడంటే... తన పేరు, చిత్రానికి కూడా ఆయన లైసెన్స్ లు పొందారు. టర్కీకి చెందిన ఓ వ్యాపారవేత్త ట్రంప్ అనే పేరును వాడుకున్నందుకు డబ్బు చెల్లించాడు. రియల్ ఎస్టేట్ తో పాటు, అమెరికా వ్యాప్తంగా 18 గోల్ఫ్ కోర్సులను ట్రంప్ సంస్థ నిర్వహిస్తోంది. ఓ గోల్ఫ్ కోర్స్ నిర్మాణ సమయంలో స్థానికులతో వివాదం ఏర్పడింది. దీంతో, 6 వేల ఉద్యోగాలను ఇస్తానని ట్రంప్ వారికి హామీ ఇచ్చారు. కానీ అక్కడ చివరకు 200 ఉద్యోగాలు మాత్రమే సృష్టించగలిగారు. ఈ వ్యాపారాలతో పాటు సైక్లింగ్, ఫుట్ బాల్ లీగ్స్ లాంటి వాటికి ట్రంప్ స్పాన్సర్ గా వ్యవహరించారు. అందాల పోటీలను కూడా ఆయన ప్రమోట్ చేశారు. 1996 నుంచి 2015 వరకు మిస్ యూనివర్స్, మిస్ యూఎస్ఏ, మిస్ టీన్ యూఎస్ఏ పోటీలను ఆయన ప్రమోట్ చేశారు. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ లో కూడా ట్రంప్ కనిపించారు. స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ లో ఆయన సభ్యుడు. ఇప్పటికీ ఆయనకు ప్రతి ఏటా 1,10,000 డాలర్ల పెన్షన్ వస్తుంది. ఇక రాజకీయాల విషయానికి వస్తే... ట్రంప్ పార్టీలు మారుతూ వచ్చారు. తొలుత రిపబ్లికన్ లకు మద్దతిచ్చిన ఆయన... ఆ తర్వాత రిఫార్మ్ పార్టీకి మారారు. మరో మూడేళ్ల తర్వాత డెమొక్రాటిక్ పార్టీలో చేరారు. 2001 నుంచి 2008 వరకు ఆ పార్టీలోనే ఉన్నారు. ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీలోకి మారారు. మొత్తం ఆరుగురు డెమొక్రటిక్, నలుగురు రిపబ్లికన్ అభ్యర్థులకు ఆయన సాయం చేశారు. అయితే, వీరిలో రిపబ్లికన్లకు అనుకూలంగానే ఎక్కువ ఫలితాలు రావడంతో... ఆయన రిపబ్లికన్లకే దగ్గరయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థిత్వం కోసం 1988, 2004, 2012లో ఆయన ప్రయత్నించారు. అంతేకాదు 2006, 2014లో న్యూయార్క్ గవర్నర్ పదవిపై కూడా దృష్టి సారించారు. కానీ, ప్రత్యక్ష రేసులోకి ఆయన రాలేదు. కానీ, 2015 జూన్ 16న అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్నారు ట్రంప్. చివరకు రిపబ్లికన్ అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచారు. ఆ తర్వాత, ఎన్నికల ప్రచారంలో హిల్లరీపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారాయన. ఇదే సమయంలో లైంగిక వేధింపులు, మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయనను వెంటాడాయి. ఎన్నికల ముందు నిర్వహించిన జనరల్ డిబేట్ లలో కూడా హిల్లరీనే ఆధిక్యం కనబరచారు. అయినా, ట్రంప్ ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఏ మాత్రం తగ్గకుండా ప్రచారం నిర్వహించారు. చివరకు రిపబ్లికన్ పార్టీ వారు కూడా తనను వదలి వెళుతున్నా... పట్టు సడలించలేదు ట్రంప్. చివరకు, తాను అనుకున్నది సాధించారాయన. ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఘన విజయం సాధించారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా శ్వేతసౌధంలోకి సగర్వంగా అడుగుపెట్టబోతున్నారు.

  • Loading...

More Telugu News