: ప్రజల వద్ద ఎంత డబ్బున్నా బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చు: పెద్దనోట్ల రద్దుపై జైట్లీ స్పందన
పెద్ద నోట్లను రద్దు చేస్తూ తాము తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు. ఈ రోజు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నల్లధనాన్ని అరికట్టడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, సామాన్యులకు ఇబ్బంది కలిగించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని వ్యాఖ్యానించారు. ప్రజల వద్ద ఎంత డబ్బున్నా గుర్తింపు కార్డులతో బ్యాంకులకు వెళ్లి వాటిని తమ బ్యాంకు ఖాతాల్లో జమచేసుకోవచ్చని సూచించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో నల్లధన కుభేరులు మాత్రమే భయపడతారని జైట్లీ అన్నారు. కొత్త కరెన్సీ నోట్లు రెండురోజుల క్రితమే బ్యాంకులకు చేరుకున్నాయని ఆయన చెప్పారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పలు రంగాలు నష్టాలు చవి చూడాల్సి వస్తుందని వస్తోన్న వాదనలను జైట్లీ ఖండించారు. కేంద్రం నిర్ణయంతో ఇకపై రియల్ ఎస్టేట్ ధరలు తగ్గుముఖం పడతాయని చెప్పారు. ప్రజలు నిజాయతీగా సంపాదించిన డబ్బుకు ఇబ్బందులు ఉండవని చెప్పారు. ఈ నిర్ణయంతో దేశంలో మంచి ఫలితాలు సాధించవచ్చని, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు త్వరలోనే తొలగిపోతాయని చెప్పారు.