: టీవీ రిమోట్ కోసం తమ్ముడితో గొడవ పడిన అక్క ఆత్మహత్య
టీవీ రిమోట్ కోసం గొడవపడి ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌పీఆర్ హిల్స్ సమీపంలోని సంజయ్‌నగర్‌లో నివాసం ఉంటున్న మహ్మద్ కుమార్తె షహీనాబేగం (16) ఇంటర్ విద్యార్థిని. ఇంట్లో తన తమ్ముడు సమీర్(14)తో కలిసి టీవీ చూస్తోన్న సమయంలో ఆమె చేతిలో ఉన్న రిమోట్‌ను సమీర్ లాక్కున్నాడు. అనంతరం వేరే ఛానెల్ పెట్టుకొని చూస్తున్నాడు. దీంతో తన తమ్ముడితో షహీనా బేగం గొడవపడింది. తమ ఇష్టం వచ్చిన ప్రోగ్రామే చూస్తామంటూ పరస్పరం ఇద్దరూ తిట్టుకున్నారు. దీంతో సమీర్ తన అక్కను కొట్టాడు. గొడవలో కలగజేసుకున్న వారి తల్లి సబీనాబేగం కూడా కూతుర్ని మందలించడంతో షహీనా తీవ్ర మనస్తాపం చెందింది. వెంటనే గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది. దీనిని గమనించిన షహీనాబేగం తల్లిదండ్రులు ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, షహీనా అప్పటికే మరణించిందని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.