: పని చేస్తారా? చస్తారా?: తన కింది అధికారులతో నితిన్ గడ్కరీ
ఈ డిసెంబర్ లోగా దేశవ్యాప్తంగా 2 లక్షల కిలోమీటర్ల రహదారి కనెక్టివిటీ పూర్తి కావాల్సిందేనని గట్టి పట్టుదలతో ఉన్న రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, తన ఉద్యోగుల వెంటబడి మరీ లక్ష్యాల సాధనకు పరుగులు పెట్టిస్తున్నారు. అధికారులు చచ్చినట్టు పని చేయాల్సిందేనని, ఎట్టి పరిస్థితుల్లోను రోడ్ల నిర్మాణాలు అనుకున్న సమయానికి పూర్తి కావాల్సిందేనని తాను స్వయంగా హెచ్చరిస్తున్నట్టు గడ్కరీ తెలిపారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఇండియాలో మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఇస్తున్న బ్యాంకు రుణాలపై వడ్డీ 11 శాతంగా ఉండటం, ఈ రంగాన్ని కొంత ఇబ్బందులు పెడుతోందని అన్నారు. వడ్డీ రేటు 7 శాతం కన్నా దిగువకు వస్తే, పనులు మరింత వేగంగా పూర్తవుతాయని అన్నారు. రోడ్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల విస్తరణ పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్లాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా తన శాఖ పనులు చేస్తున్నట్టు తెలిపారు. రహదారి కనెక్టివిటీ 55 నుంచి 60 శాతం వరకే ఉందని గుర్తు చేసిన ఆయన, రోజుకు 40 కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసే లక్ష్యంతో సాగుతున్నామని తెలిపారు. ఎన్నడో ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయిన 95 ప్రాజెక్టులను తిరిగి చేపట్టామని తెలిపారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చిన వేళ, రోజుకు 3 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణమే జరుగుతోందని, దాన్ని తాము 12 రెట్లకు పైగా పెంచామని వెల్లడించారు. ఓ మంత్రిగా పెద్ద లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా ఉద్యోగులకు సలహా, సూచనలు మాత్రమే తాను ఇస్తున్నానని, క్షేత్ర స్థాయిలో పనుల బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు. "ఓ మంత్రిగా అధికారుల బాధ్యతను గుర్తు చేస్తూ, పనులు చెయ్యాల్సిందేనని చెప్పేందుకు 'చెయ్యండి లేదా చావండి' అని చెప్పాల్సి వస్తోంది" అన్నారు.