: అమెరికా అధ్యక్ష ఎన్నికలు: అంతరిక్షం నుంచి ఓటు వేసిన శాస్త్రవేత్త
ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే ఉంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌లలో ఎవరు అధ్యక్ష పీఠాన్ని అధిష్టిస్తారోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. మరి కొన్ని గంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే, పోలింగ్ ప్రారంభం కాకముందే అంతరిక్షం నుంచి షేన్ కింబ్రౌ అనే శాస్త్రవేత్త అప్పుడే ఓటు వేసేశారు. అక్టోబర్ 19న సోయుజ్ రాకెట్‌లో ఫోర్త్ మిషన్ రీసెర్చ్ కోసం సదరు శాస్త్రవేత్త ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వెళ్లారు. ఆయన అక్కడి నుంచే ముందస్తుగా ఓటు వేశారని నాసా అధికారులు ప్రకటించారు. కాగా ఓటు హక్కును ఆయన ఎలా వినియోగించుకున్నారో, ఏ పద్ధతి ద్వారా అక్కడి నుంచి సెండ్ చేశారో, ఎవరికి ఓటు వేశారో మాత్రం అధికారులు తెలపలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం నాసా శాస్త్రవేత్తలు అంతరిక్షం నుంచి 1997 నుంచి తమ ఓట్లు వేస్తున్నారు. ఇలా ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ప్రథముడు డేవిడ్ ఉల్ఫ్ అనే శాస్త్రవేత్త.