: తనకు అన్యాయం జరిగిందంటూ ఒకప్పుడు ఢిల్లీ హైకోర్టును డొనాల్డ్ ట్రంప్ ఆశ్రయించిన వైనం!
ప్రస్తుతం అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్, విజయం సాధిస్తే, అమెరికాకు అధ్యక్షుడవుతారు. కానీ, అంతకుముందే ఎన్నడో భారత కోర్టుల రికార్డుల్లో ఆయన పేరు రాసుంది. అసలెందుకు ఆయన భారత కోర్టులకు ఎక్కారన్న ఆసక్తికర విషయాన్ని తెలుసుకుంటే... దాదాపు ఆరేళ్ల క్రితం కోటక్ మహీంద్రా బ్యాంకు 'ట్రంప్' పేరిట ఓ క్రెడిట్ కార్డును ఆవిష్కరించింది. ఈ విషయం తెలుసుకున్న ట్రంప్ వర్గం, తమ ట్రేడ్ మార్క్ దుర్వినియోగం అవుతోందని ఆరోపిస్తూ, ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. కేసు వాదనను ట్రంప్ కుమారుడు డొనాల్డ్ జే ట్రంప్ స్వయంగా పర్యవేక్షించారు. 'కోటక్ ట్రంప్ కార్డ్' అంటూ క్రెడిట్ కార్డులను విక్రయించడం వల్ల తమ సంస్థకు నష్టమని వాదించారు. ఈ విషయంలో ట్రంప్ కు మధ్యంతర రిలీఫ్ ను ఇవ్వడానికి హైకోర్టు తిరస్కరించింది కూడా. అయితే, కేసు విచారణ దశలో ఉండగానే ఏం జరిగిందో ఏమో, కోటక్ బ్యాంకు, ట్రంప్ వర్గాలు మధ్యే మార్గంగా వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ముందుకు వచ్చాయి. దీంతో ఓ మధ్యవర్తిని నియమించిన హైకోర్టు, వివాదాన్ని మీడియేషన్ సెల్ కు బదిలీ చేసింది. ఫిబ్రవరి 25, 2010న సీనియర్ అడ్వొకేట్ సుధాంశు బాత్రా మధ్యవర్తిత్వంలో చర్చలు మొదలయ్యాయి. ట్రంప్ రాకుండానే చర్చలు సాగడంలో అర్థం లేదన్న వాదన వచ్చింది. చివరకు చర్చలు విఫలమయ్యే దశలో హైకోర్టు హెచ్చరికలు కూడా జారీచేసింది. ఆఖరికి అక్టోబర్ 2013లో ట్రంప్ కార్డును వెనక్కు తీసుకుని వేరే పేరిట కార్డులను జారీ చేసేందుకు కోటక్ అంగీకరించడంతో వివాదం ముగిసింది.