: సాక్షి పేపర్లు ముద్రించకముందే దాని షేర్లను ప్రీమియం ధరకు అమ్మేశారు.. మాకా ఖర్మ పట్టలేదు: లోకేష్


వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలన్నీ 'క్విడ్ ప్రోకో' చుట్టే తిరుగుతాయని, అవి ఆయన పేటెంట్ ఆలోచనలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. కంపెనీలు పెట్టి అవి ఇంకా ఉత్పత్తిలోకి రాకముందే వాటి షేర్లను అధిక ధరకు అమ్మేస్తారని ఆరోపించారు. సాక్షి పేపరును ముద్రించకముందే దాని షేర్లను ప్రీమియం ధరకు అమ్మేశారని గుర్తు చేశారు. నల్ల ధనాన్ని తెల్లగా మార్చడం ఎలాగో జగన్ దగ్గరే నేర్చుకోవాలని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో హెరిటేజ్ కంపెనీ తరపున నిర్వహించిన విలేకరుల సమావేశం తర్వాత లోకేశ్ కొద్దిసేపు విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అవసరమైతే ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న జగన్ ప్రకటన ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. దీనిపై లోకేశ్ స్పందిస్తూ ‘‘రాజీనామా చేయిస్తారా? చేయించమనండి. ఆ సీట్లను కూడా మేమే గెలుస్తాం. ఎంపీ సీట్లే కాదు ఎమ్మెల్యే సీట్లకు రాజీనామా చేసినా సరే మేం సిద్ధం. ఎవరెన్ని స్థానాలు గెలుస్తారో ప్రజలే చూస్తారు’’ అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక హెరిటేజ్ షేర్ల విలువ విపరీతంగా పెరిగిందన్న జగన్ ఆరోపణలను లోకేశ్ కొట్టిపడేశారు. కంపెనీ పెట్టిన తర్వాత టీడీపీ మూడుసార్లు అధికారంలోకి వచ్చిందని, రెండుసార్లు ప్రతిపక్షంలో ఉందని గుర్తు చేశారు. ఫ్యూచర్ గ్రూప్ సంస్థకు క్విడ్ ప్రోకోకు పాల్పడాల్సిన ఖర్మ లేదని, అటువంటివి జగన్ పేటెంట్ ఆలోచనలని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News