: అమెరికా వైమానిక దాడుల్లో 32 మంది ఆఫ్గాన్ పౌరుల మృతి.. మృతదేహాలతో వీధుల్లో ఆందోళన
ఆఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాదులను అంతమొందించేందుకు అమెరికా దళాలు ఆ దేశ సైన్యంతో కలసి దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే, గత వారం ఆ దేశంలో అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 32 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ఈ రోజు వెల్లడించింది. దాడుల్లో పౌరులు మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేసిన ఐరాస ఈ చర్య ఆమోదయోగ్యం కాదని చెప్పింది. అమెరికా జరిపిన దాడుల్లో మరో 19 మంది పౌరులు గాయాలపాలయ్యారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. అమెరికా వైమానిక దాడులకు నిరసనగా ఆఫ్గాన్ పౌరులు వారి మృతదేహాలతో వీధుల్లో ఆందోళనకు దిగారు. అమెరికా ఆ ప్రాంతంలో జరిపిన వైమానిక దాడుల్లో కుందుజ్ వాసులు మృతి చెందడం ఏడాదిలో ఇది రెండోసారి. అక్టోబరు 2015లో అమెరికా జరిపిన వైమానిక దాడిలో ప్రమాదవశాత్తు ఆ ప్రాంతంలోని ఓ ఆసుపత్రి ధ్వంసమైంది. ఈ దాడుల్లో 42 మంది కుందుజ్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అప్పట్లో ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వచ్చాయి.