: ఎన్డీటీవీతో పాటు మరో రెండు చానళ్లపైనా నిషేధం
నిబంధనలను అతిక్రమించాయన్న ఆరోపణలతో ఎన్డీటీవీతో పాటు మరో రెండు టీవీ చానళ్లను నవంబర్ 9న నిషేధిస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ తెలిపింది. అసోంకు చెందిన 'ప్రతిదిన్ టైమ్', (గతంలో న్యూస్ టైమ్ అస్సామ్), 'కేర్ వరల్డ్ టీవీ'ల ప్రసారాలను బుధవారం నాడు నిలిపివేస్తున్నట్టు ఆదేశాలు వెలువడ్డాయి. ఈ రెండు చానళ్లూ అభ్యంతరకర సన్నివేశాలను చూపాయని సమాచార శాఖ ఆరోపించింది. చానళ్లు చూపిన దృశ్యాలు వ్యక్తుల ప్రైవసీని దెబ్బతీసేలా, చిన్నారుల హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని తెలిపింది. ఈ చానళ్ల ప్రసారాలపై అక్టోబర్ 2013లోనే షోకాజ్ నోటీసులు ఇచ్చామని వెల్లడించింది. చానళ్ల అభిప్రాయాన్ని స్వీకరించిన తరువాతనే ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఈ ఒకరోజు నిషేధాన్ని విధించినట్టు తెలిపింది.