: మేడం! మీరు రాజీనామా చేస్తారా? నన్ను ఆత్మహత్య చేసుకోమంటారా?: ప్రభుత్వ విప్ సునీతకు యువతి ఫోన్‌కాల్


జిల్లాల విభజనతో తమ ఉద్యోగావకాశాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ యువతి ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డికి ఫోన్ చేసింది. తక్షణం రాజీనామా చేయకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక సునీతకు ఓ ఫోన్‌కాల్ వచ్చింది. ఓ యువతి మాట్లాడుతూ ‘మేడం, గుండాల మండలాన్ని జనగామ జిల్లాలో కలపడంతో మా ఉద్యోగావకాశాలు దెబ్బతిన్నాయి. మీరు మా మండలాన్ని జనగామ జిల్లాలో ఎలా కలిపారు?’’ అని ప్రశ్నించింది. దీనికి ఎమ్మెల్యే బదులిస్తూ ‘‘అది నేను కలపలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కలిపారు. నీవేమైనా అడగదల్చుకుంటే ఆయననే అడగాలి’’ అని సునీత బదులిచ్చారు. దీనికి స్పందించిన యువతి ‘‘మేం మీకు ఓటేసి గెలిపిస్తే మీరు సీఎంను అడగమంటే ఎలా? మీరు కలపమని చెప్పకపోయి ఉంటే వెంటనే మీరు మీ పదవికి రాజీనామా చేయండి. లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటా’’ అని హెచ్చరించింది. దీనికి సునీత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘‘ఏం బెదిరిస్తున్నావా?’’ అని ఫోన్ ఫెట్టేశారు. ఇక్కడితో సమస్య ముగిసిందని అనుకున్నారు. అయితే ఆ తర్వాత కాసేపటికే యువతి వాట్సాప్ గ్రూప్‌లో పెట్టిన మెసేజ్ కలకలం రేపింది. ‘‘ఉదయం ఐదు గంటల లోపు గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలిపేందుకు ఎమ్మెల్యే సునీత హామీ ఇవ్వకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటా’’ అంటూ ‘మన గుండాల’ వాట్సాప్‌ గ్రూప్‌లో మెసేజ్ పెట్టింది. అది చూసిన ఎమ్మెల్యే కంగుతిన్నారు. వెంటనే విషయాన్ని జనగామ డీసీపీ వెంకన్న దృష్టికి తీసుకెళ్లారు. ఫోన్ చేసిన యువతిని మాసాన్‌పల్లికి చెందిన కేమిడి స్వప్నగా గుర్తించిన డీసీపీ రాత్రి 12 గంటల సమయంలో గ్రామానికి వెళ్లి స్వప్నను కలుసుకున్నారు. తనను కలిసిన పోలీసధికారికి స్వప్న తన ఆవేదనను వినిపించింది. గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాలో కాకుండా జనగామ జిల్లాలో కలపడంతో తమ ఉద్యోగావకాశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించింది. ఆమె ఆవేదనను విన్న డీసీపీ సమస్యలకు పరిష్కారం ఆత్మహత్య కాదని నచ్చజెప్పారు. గుండాలను జనగామలో చేర్చడం వల్ల ఆరో జోన్ నుంచి ఐదో జోన్‌కు మారింది. యాదాద్రి జిల్లాలో 105 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా జనగామలో 21 పోస్టులే ఉండడమే స్వప్న ఆవేదనకు కారణం.

  • Loading...

More Telugu News