: మహాత్మాగాంధీ మనవడి దీనావస్థ.. చేతిలో చిల్లిగవ్వలేక ఆస్పత్రిలో చివరి రోజుల్లో కానూ గాంధీ


కానూ రాందాస్ గాంధీ.. బహుశా ఈ పేరును ఎవరూ మర్చిపోయి ఉండరు. ఉప్పు సత్యాగ్రహం సమయంలో దండి సముద్ర తీరంలో ఓ పదేళ్ల కుర్రాడు మహాత్మాగాంధీ చేతికర్ర పట్టుకుని నడుస్తున్న చిత్రం అప్పట్లో ప్రపంచదేశాలను ఆకర్షించింది. గాంధీ చేతికర్ర పట్టుకున్న ఆ కుర్రాడు మరెవరో కాదు.. గాంధీ మనవడు కానూ రాందాస్ గాంధీయే. ఇప్పుడతనికి 96 ఏళ్లు. దండి సత్యాగ్రహానికి సజీవ సాక్షిగా నిలిచిన ఆయన ప్రస్తుతం అత్యంత దుర్భర స్థితిలో ఆస్పత్రి బెడ్‌పై దయనీయంగా ఉన్నారు. జాతిపిత గాంధీ మనవడిగా, నాసా శాస్త్రవేత్తగా ఘన చరిత్ర ఉన్న ఆయనను పట్టించుకునేవారు లేక సూరత్‌లోని ఓ ట్రస్ట్ ఆస్పత్రిలో చివరి రోజులు గడుపుతున్నారు. ఇప్పుడు ఆయన వెంట భార్య శివలక్ష్మి(90) తప్ప నా అన్న వారెవరూ లేరు. గాంధీ మనవడిగా కంటే ఆయన సన్నిహితుడిగానే చాలామందికి కానూ పరిచయం. గాంధీ వ్యక్తిగత అవసరాలను ఆయనే స్వయంగా చూసుకునేవారు. స్వాతంత్ర్యానంతరం భారత్‌లో అప్పటి అమెరికా రాయబారి జాన్ కెన్నెత్ సాయంతో మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యనభ్యసించిన కానూ గాంధీ తర్వాత నాసా, అమెరికా రక్షణ శాఖలో ఉద్యోగం చేశారు. ఆ సమయంలోనే మెడికల్ రీసెర్చర్ అయిన శివలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం లేదు. 40 ఏళ్లు అమెరికాలో ఉన్న కానూ దంపతులు రెండేళ్ల క్రితం తిరిగి భారత్ చేరుకున్నారు. భారత్‌లో వారికి సొంతిల్లు లేకపోవడంతో కొన్నాళ్లు ఆశ్రమాలు, సత్రాల్లో గడిపారు. ఉద్యోగంలో సంపాదించినది దానధర్మాలకు ఇచ్చేయడంతో చేతిలో చిల్లిగవ్వలేని దీనస్థితికి చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కానూ గాంధీ పక్షం రోజులుగా సూరత్‌లోని రాధాకృష్ణన్ ఆలయం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు వైద్య చికిత్సలు అందిస్తూనే భార్యాభర్తలను దగ్గరుండి చూసుకునేందుకు ఆస్పత్రి ఓ యువకుడిని నియమించింది. కానూ చిన్ననాటి స్నేహితుడైన దీమంత్ బధియా(87) విషయం తెలిసి ఇటీవల కొంత సాయం అందించారు. ముంబై, బెంగళూరుల్లో నివసిస్తున్న కానూ సోదరీమణులు కూడా వయసు మీదపడడంతో కదిలే పరిస్థితి లేదు. దీంతో ఫోన్లోనే సోదరుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. కానూ దీనావస్థను తెలుసుకున్న ఓ కేంద్రమంత్రి విషయాన్ని ప్రదాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. కానూకు సాయంపై మోదీ హామీ ఇచ్చినట్టు తెలిసింది. అయితే గుజరాత్ మంత్రులెవరూ ఇప్పటి వరకు కానూవైపు కన్నెత్తి కూడా చూడలేదని బధియా ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబరు 22న కానూకు గుండెపోటు వచ్చింది. ఫలితంగా పక్షవాతం వచ్చి ఎడమవైపు శరీరం భాగం చచ్చుబడిపోయింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు.

  • Loading...

More Telugu News