: ఐఎస్ఐఎస్ చీఫ్ పారిపోయాడు: బ్రిటన్
ఇరాక్ లోని మోసుల్ నగరం నుంచి ఐఎస్ఐఎస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ పారిపోయాడని బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఇరాక్ భద్రతాదళాలపై పోరాటాన్ని కొనసాగించాలని... వెనకడుగు వేయరాదంటూ తమ ఫైటర్స్ ను ఉద్దేశిస్తూ బాగ్దాదీ మాట్లాడిన ఆడియో నిన్న విడుదలైంది. ఈ వీడియోను బట్టి చూస్తుంటే బాగ్దాదీ మరో సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాడని తమ ఇంటలిజెన్స్ వర్గాలు భావిస్తున్నట్టు బోరిస్ తెలిపారు. 2014 నుంచి మోసుల్ నగరం ఐఎస్ చెరలోనే ఉంది. ఎంతో కీలకమైన ఈ నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇరాక్ దళాలు పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో, గత కొన్ని రోజులుగా సంకీర్ణదళాలతో కలసి ఇరాకీ బలగాలు చేస్తున్న పోరాటం భీకర దశకు చేరుకుంది. ఐఎస్ ఉగ్రవాదులు భారీ సంఖ్యలో హతమవుతున్నారు. ఎంతో మంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నగరం విడిచి పరారవుతున్నారు. ఇదే రకంగా ఐఎస్ చీఫ్ కూడా పలాయనం చిత్తగించాడని బ్రిటన్ తెలిపింది. మోసుల్ లో 3 వేల నుంచి 5 వేల వరకు ఐఎస్ ఉగ్రవాదులు ఉంటారని అమెరికా భావిస్తోంది.