: పిడిగుద్దులు గుద్దిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి: సీపీఎం మధు
తూర్పుగోదావరి జిల్లాలోని తొండంగి మండలం దానవాయిపేటలో దివీస్ ఫార్మాకి వ్యతిరేకంగా సభ నిర్వహించాలని చూసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును నిన్న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన మధు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఆ ప్రాంతంలో తనను అదుపులోకి తీసుకుంటున్న సందర్భంగా పిడిగుద్దులు గుద్దిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. దానవాయిపేటలో దివీస్ కు వ్యతిరేకంగా మరోసారి సభ నిర్వహించి తీరుతామని, ఈ నెల 15న తమ పార్టీ జాతీయ నేత రాఘవులు, 27న సీపీఎం ఎంపీల బృందం ఆ ప్రాంతంలో పర్యటిస్తుందని చెప్పారు. ఏపీ సర్కారు కాలుష్య కారక పరిశ్రమలను ప్రోత్సహిస్తోందని మధు మండిపడ్డారు. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసహనం కలుగుతోందని, వారు ఆరు నెలలుగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారని ఆయన అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్న హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో బీచ్ ఫెస్టివల్‌కు సహకరిస్తూ తన హామీలను మరిపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.