: పెను తుపానుగా మారుతున్న వాయుగుండం, సిద్ధంగా ఉన్న విపత్తు బృందాలు
అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారి, పెనుతుపానుగా రూపాంతరం చెందుతోందని, ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయాన 570 కి.మీ. దూరంలో ఉన్న వాయుగుండం గంటకు 20 కి.మీ వేగంతో ఒడిశా వైపు పయనిస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలతో పాటు కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో రాగల 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల కుంభవృష్టి పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. కాగా, ఈ తుపాను ప్రభావం తమిళనాడు తీర ప్రాంతంపై ఎక్కువగా ఉండవచ్చన్న అంచనాలతో విపత్తు సహాయక బృందాలను సిద్ధం చేసినట్టు ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఒక్కో లోతట్టు ప్రాంతానికి ఒక్కో ఐఏఎస్ అధికారిని నియమించామని, అన్ని ముందు జాగ్రత్త చర్యలూ తీసుకున్నామని వివరించారు. ఇప్పుడే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు పడుతున్న వేళ, అల్పపీడనం కారణంగా మరింత వర్షాలు కురిస్తే, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుతుందన్న ఆలోచనతో అప్రమత్తమైనట్టు తెలిపారు.