: సిమీ అనేది దేశ వ్యతిరేక సంస్థ.. స్వేచ్ఛకు హద్దులుంటాయి: వెంకయ్యనాయుడు
ఇటీవల భోపాల్‌లో పోలీసుల చేతిలో హతమైన సిమీ ఉగ్రవాదుల అంశంలో పలువురు నేతలు చేస్తోన్న వ్యాఖ్యల పట్ల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. కృష్ణాజిల్లా, ఆత్కూరులో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... సిమీ అనేది దేశ వ్యతిరేక సంస్థ అని, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉదాసీనంగా వ్యవహరించకూడదని అన్నారు. స్వేచ్ఛకు హద్దులుంటాయని, అవి మీరితే శిక్ష తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మాట్లాడిన వెంకయ్య నాయుడు గాంధీజి సూచన మేరకు వల్లభాయ్ పటేల్ పదవిని వదులుకున్నారని అన్నారు. సర్దార్ పటేల్ ప్రధానమంత్రి అయి ఉంటే భారత్ ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండేదని అన్నారు. కశ్మీర్ అంశాన్ని తానే చూసుకుంటానని సర్దార్‌తో నెహ్రూ అన్నారని వెంకయ్య పేర్కొన్నారు. సర్దార్ వల్లాభాయ్ పటేల్ 564 సంస్థానాలను దేశంలో విలీనం చేసిన నేత అని, పట్టుదలకు ప్రతీకగా నిలిచారని వెంకయ్య అన్నారు.